-రోడ్లప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా కేటాయించాలి
-ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు అనుమతిలేదు… ఉన్నవాటిని చెరిపించేయాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల ప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్దంగా ఎటు వంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు.
ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని ఒక సారి పరిశీలించాలని, స్ట్రక్చర్ లో ఏమాత్రం దృడత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుండి లిక్కరు, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఇందులో భాగంగ సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. రాజయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాలు పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, అటు వంటి చట్టవ్యతిరేఖ కార్యక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
సి-విజిల్ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో శతశాతం పరిష్కరించాలని, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మంట్ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్పోర్స్మెంట్ ఏజన్సీలపై ఒత్తిడి పెంచాలన్నారు. ఇంకా కొన్ని జిల్లాల నుండి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు అందలేదని, వాటిని వెంటనే తమకు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపే ఎన్నికల సిబ్బందికి మరో ఒకటి రెండు సార్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే అంశంపై జిల్లా ఎన్నికల అధికారలు దృష్టి సారించాలన్నారు.