చట్టాన్నిఉల్లంఘించి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేశారు
జడ్జి ముందు ఎందుకు హాజరు పరచలేదు?
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి, మహానాడు: విదేశాల్లో చదువుకుని ప్రజాసేవకు వచ్చిన 25 ఏళ్ల యువకుడిని జిల్లా కలెక్టర్ సాక్షిగా అక్రమ కేసులో ఇరికించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనకు సంబంధంలేని ఘటనలో 52 రోజుల తర్వాత ఏ–37 గా కేసు పెట్టారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కుమారుడు, చంద్రగిరి నుంచి వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నంపై ఆయన మాట్లాడారు.
ప్రజల మధ్యే ఉంటూ, సొంతూరులోనే పోలీసుల కళ్లేదుటే కనిపిస్తున్నా అప్పుడు పోలీసులు పట్టించుకోలేదని, స్నేహితుడి పెళ్లికి వెళ్తున్న సమయంలో దేశద్రోహులు, ఆర్థిక నేరస్తులు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు తరహాలో బెంగళూరు వెళ్లి మరీ అరెస్టు చేయడానికి యత్నించడం, చివరకు లుక్ అవుట్ నోటీసులు జారీచేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నోటీసు ఇస్తే తామే విచారణకు వచ్చేవారమని, అలాకాకుండా ఇంత హైడ్రామా దేనికని ప్రశ్నించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం చేయవద్దని చెప్పినా పోలీసులు తప్పుడు మార్గాన్ని అనుసరించారన్నారు. రాష్ట్రం దాటి వెళ్లి మరీ అర్ధరాత్రి అరెస్టుకు ప్రయత్నించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. 10 గంటల పాటు వేధించి తిరుపతికి తీసుకు వచ్చారన్నారు. అనంతరం ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరుకావాలని 41(సీ) నోటీసులు ఇచ్చి పంపారని తెలిపారు.
బుల్లెట్‌తో కాల్చినా.. వంద కేసులు పెట్టినా భయపడం
లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి మరీ తీసుకువచ్చి 41(సీ) నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేసిన తర్వాత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని చేస్తున్న దందాలు, దౌర్జన్యాలు, భూఆక్రమణలు, వ్యాపారులను బెదిరించడం, కాంట్రాక్టర్లను దోచుకోవడం వంటి అప్రజాస్వామిక విధానాలపై తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీస్తున్నారనే కక్షతోనే ఘటన జరిగిన 52 రోజుల తర్వాత కేసులో తనను ఏ–37 గా ఇరికించారని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో బెదిరించాలని, నియోజకవర్గం క్యాడర్‌ను భయాందోళనకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
విదేశాల్లో చదువుకుని ప్రజాసేవకు వచ్చిన తనపై ఇది మొదటి కేసు అన్నారు. ఇలాంటి అక్రమ కేసులు వంద పెట్టినా, బుల్లెట్లతో కాల్చినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఒక కేసు పెడితే వంద అడుగులు ముందుకు వేస్తామని, వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఈ కేసుతో తన ప్రమేయం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. తన తండ్రి ప్రజలకు సేవ చేయడం, ప్రజల పక్షాన పోరాడటమే నేర్పించారని, తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితమన్నారు. తమను రాజకీయ సమాధి చేస్తామని పులివర్తి నాని పగటి కలలు కంటున్నారని, కక్షతో తమను సమాధి చేస్తారేమో కానీ, రాజకీయ సమాధి మీ తరం కాదన్నారు.
జడ్జి ముందు ఎందుకు హాజరుపరచలేదు?
మోహిత్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మోహిత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో కూడా పేరు లేని వ్యక్తిని 52 రోజుల తర్వాత ఏ–37 గా ఇరికించడం అప్రజాస్వామికమన్నారు.
ఇది తప్పుడు కేసు అని ప్రభుత్వానికి, పోలీసులకు కూడా తెలుసన్నారు. ఎవరిని తృప్తి పరిచేందుకు లుక్ అవుట్ నోటీసులు, అరెస్ట్‌లంటూ నిలదీశారు. అయినా మెమో ఇచ్చి దానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విధానం పోలీసు వ్యవస్థలో లోపాలకు నిదర్శనమన్నారు. మోహిత్‌రెడ్డిపై మోపిన అభియోగాల్లో ఆధారాలు లేకపోవడం, ఘటన జరిగిన సమయంలో జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారుల సమక్షంలోనే సీసీ కెమెరాల సాక్షిగా మోహిత్‌రెడ్డి ఉండటం, కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేకపోవడం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంఘటనలో ప్రమేయాన్ని నిరూపించలేకపోవడం, కేవలం రాజకీయ కక్షతోనే అతని పేరును కేసులో ఇరికించారు.
ఇరికించారనే విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు వెనక్కి తగ్గారన్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినంత ఈజీగా అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు ఎందుకు హాజరుపరచలేకపోయారు. పోలీసులకు ధమ్ము, ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి, మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరుపరిస్తే ఇది అక్రమ కేసు అని, రాజకీయ కక్షతోనే వేధిస్తున్నారని బయటపడుతుంది. ఈ ఘటనలో బాధ్యులైన వారిని న్యాయదేవత ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని అన్నారు.