Mahanaadu-Logo-PNG-Large

వృక్షాలను విధ్వంసం చేయకండి

– జన చైతన్య వేదిక

గుంటూరు, మహానాడు:   రోడ్ల విస్తరణ, ఆధునీకరణ పనుల్లో వేలాది చెట్లను కోల్పోతున్నామని, స్థానికంగా దుబాయ్ మొక్కగా పిలిచే కోనోకార్పస్ వృక్షాలను తొలగించవద్దని జన చైతన్య వేదిక పేర్కొంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి.ధనుంజయ రెడ్డి, తెలుగు భాషోద్యమ కన్వీనర్ డాII వి.సింగారావుతో పాటు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..  కోనో కార్పస్ మొక్కలు వాయు కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తుందని, గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందని, ఆక్సిజన్ ను అధికంగా అందిస్తుందని తెలిపారు. అయితే కోనోకార్పస్ చెట్ల పూల నుంచి వచ్చే పుప్పొడి రేణువుల వలన ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలు ఉంటాయని, భూగర్భ జలాలు అంతరిస్తాయని ఎలాంటి పక్షులు ఈ చెట్టుపై వాలవని లాంటి దురభిప్రాయాలను, పుకార్లను లేవనెత్తి కోనో కార్పస్ చెట్లను విధ్వంసం చేస్తున్నారన్నారు. వాల్టా చట్టం 2002 ప్రకారం సంబంధిత అధికారుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఏ చెట్టు తొలగించినా నేరం అవుతుందన్నారు. జరిమాన తో పాటు కఠిన శిక్షలు ఉంటాయని తొందరపడి ఎవరు చెట్ల విధ్వంసానికి పాల్పడవద్దని  విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ ప్రస్తుతం ఉన్న దుబాయ్ మొక్కలను తొలగించకుండా శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు వచ్చిన తర్వాతనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ప్రసంగిస్తూ తొందరపాటు నిర్ణయాలతో శాస్త్రీయ పరిశోధనలు జరగకుండా దాదాపు రెండు దశాబ్దాల నుండి పెరుగుతున్న దుబాయ్ మొక్కలను తొలగించరాదన్నారు. నేస్తం సహ వ్యవస్థాపకులు టి.ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజలు ప్రకృతిని పూజించడంతో పాటు ప్రేమించడం కూడా అలవరచు కోవాలన్నారు. నెగిటివ్ కార్బన్ డై ఆక్సైడ్ ఉన్న ఏకైక దేశం భూటాన్ ను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు భాషో ఉద్యమ సమాఖ్య కన్వీనర్ డాక్టర్ వి. సింగారావు ప్రసంగిస్తూ పట్టణీకరణ పెరిగే కొలది అపార్ట్మెంట్ సంస్కృతి ఏర్పడి మొక్కలను నాటకుండా ఉన్న వాటిని తొలగిస్తూ కార్బన్ డై ఆక్సైడ్ అత్యధికంగా విడుదల చేసే ఎయిర్ కండిషన్ లను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.