పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట, మహానాడు : శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఉపేక్షించబోమని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల టౌన్, దుర్గి , వెల్దుర్తి, పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. వెల్దుర్తి, దుర్గి పోలీస్ స్టేషన్ల పరిధిలోనీ సమస్యాత్మక గ్రామాలైన గుండ్లపాడు, జంగమహేశ్వరపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు.
పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదుదారులకు వెయిటింగ్ రూమ్ ఉండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని సూచించారు.
పిడుగురాళ్ల పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి. డ్రంకన్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C, తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో నిందితులను త్వరగా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ సమయంలో నమోదైన కేసులను, పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. పోలీసు స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హోటల్స్ లాంటి ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని, ప్రత్యేక టీమ్స్ పెట్టి గంజాయి అమ్ముతున్న, తాగుతున్న వారిపై నిఘా పెట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా రాత్రి, పగలు బీట్ల పని తీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు
వెల్దుర్తి, దుర్గి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన గుండ్లపాడు, జంగమహేశ్వరపాడులో ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు చట్టాలను, గౌరవించాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, ఎవరైనా రెచ్చగొట్టే మాటలు చెప్తే అవి విని ఆలోచించకుండా ఆవేశపడి గొడవలు పెట్టుకుని, కేసులతో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే నా దృష్టి కైన తీసుకురావాలని, అంతేగాని ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. ఎవరైనా గ్రామాల్లో అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, ఇంకా ఎక్కువ చేస్తే జిల్లా బహిష్కరణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.