-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-ఒకటో వార్డులో వైసీపీ 20 కుటుంబాలు టీడీపీలో చేరిక
వినుకొండ, మహానాడు: భవిష్యత్‌పై సొంతపార్టీలో నమ్మకం కలిగించలేని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని 5 కోట్ల మంది ప్రజలు ఎలా విశ్వసిస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన ప్రజలతో పాటు, వెంట నడిచిన వారిని నిలువునా ముంచబట్టే ఎవరూ ఆ పార్టీలో ఇమడలేక బయట మార్గాల కోసం ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
శనివారం కూడా వినుకొండ తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి. వినుకొండ ఒకటో వార్డు వెన్నపూస కాలనీకి చెందిన 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆంజనేయులు సమక్షంలోనే వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జి.వి.ఆంజ నేయులు మాట్లాడారు. వీరంతా తెలుగుదేశం పిలిస్తే రావడం లేదని, వారంతట వారే జగన్‌కు గత ఎన్నికల్లో ఎందుకు మద్దతిచ్చామా అన్న పశ్చాత్తాపంతోనే వస్తున్నారన్నారు. ఐదేళ్లలో పల్లెల అభివృద్ధిని వైకాపా పూర్తిగా గాలికి వదిలేసిందని, పంచాయతీలకు చెందిన వేల కోట్ల నిధుల మళ్లింపుతో కనీస అవసరాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. చిన్నచిన్న హామీలు కూడా నెరవేర్చలేక వైకాపా తరపున ఓట్లు అడగటానికి మొహం చెల్లక క్షేత్ర స్థాయి నేతలంతా టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.