– అమెరికాలో ఉన్న సగం మంది డాక్టర్లు గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వెళ్లిన వాళ్లే
– నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల సహకారం జి. జి. హెచ్ కు ఉపయోగం
– జిజిహెచ్ వైద్యుల సమావేశంలో పెమ్మసాని
‘విధుల నిర్వహణలో వైద్యులు సమయపాలన పాటించాలి. ఇది కొందరికి ఇబ్బంది కలిగించినా, పెద్ద మనసుతో సహకరించాలి. ప్రజలకు భద్రత కల్పించిన రోజే మనం మన బాధ్యత సరిగా నిర్వహించగలుగుతాం.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు.
జి జి హెచ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన సి.టి స్కాన్ కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్ తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం జి.జి.హెచ్ లోని పలు వార్డులు, అక్కడి సమస్యలను పెమ్మసాని గారు స్వయంగా పరిశీలించారు.
అనంతరం సుశ్రుత హాల్లో ఏర్పాటు చేసిన వైద్యుల సమావేశంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందించే క్రమంలో వైద్యులు కూడా క్రమశిక్షణతో విధులకు హాజరు కావడం తప్పనిసరి అన్నారు. అలాగే పలు ఘటనల్లో వైద్యులపై దాడులు భద్రత లేని పరిస్థితులపై పార్లమెంట్ లో తాను మాట్లాడబోతున్నట్లుగా వివారించారు. వైద్యుల సౌకర్యాలు, భద్రత పైనా దృష్టి సారించే బాధ్యత తమదని ఆయన భరోసా ఇచ్చారు.
అలాగే నర్సింగ్ కాలేజీలను సంప్రదించి, అక్కడి నర్సింగ్ విద్యార్థినులకు ట్రైనింగ్ అందిస్తే జి జి హెచ్ లో వైద్య సేవలకు ఉపయోగపడతారని ఆయన సూచించారు. అవసరాన్ని బట్టి నర్సరీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కూడా ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు, ఎమ్మెల్యేలు మొహమ్మద్ నశీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ మేయర్ సజీల, జి.జి.హెచ్ సూపరిండెంట్ డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.