– సీఎం, కేంద్ర మంత్రిని కలిసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
మంగళగిరి, మహానాడు: ప్రకాశం జిల్లాలోని దొనకొండకు త్వరలో పారిశ్రామిక సొగసు రానుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కేంద్ర మంతి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆ ప్రాంత అభివృద్ధి విషయమై చర్చించారు. మంగళగిరి సికే కన్వెన్షన్ లో మంగళవారం జరిగిన డ్రోన్ సమ్మిట్ లో లక్ష్మి పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై చర్చించారు. విమానాశ్రయ నిర్మాణం సాధ్యా సాధ్యాలను వివరించారు. ఈ సందర్భంగా దొనకొండ వెనుకబడిన ప్రాంతమని, వలసలను నివారించే లక్ష్యంతో విమానాశ్రయానికి కేటాయించిన 354 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని డాక్టర్ లక్ష్మి కోరారు.
ముఖ్యంగా పౌర విమానయాన అనుబంధ కేంద్రంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని వినియోగించుకోవాలని, తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించి యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్మి కోరారు. దర్శి ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్న దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. దొనకొండలో విమానాశ్రయ ప్రాంతానికి కేటాయించిన స్థలాన్ని అనుబంధ వర్క్ షాప్ గా వినియోగించుకొని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు సంపూర్ణ నివేదికతో అధికారులతో కలిసి రావాలని కోరారు. దొనకొండ ప్రాంత అభివృద్ధికి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎలా చేస్తే బాగుంటుంది, ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని, త్వరలో ఇందుకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహిద్దామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. దీనిపై లక్ష్మి మాట్లాడుతూ దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే వలసలు నివారించగలుగుతామని అన్నారు.