– అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం
– గుంటూరులోని నీట మునిగిన ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పర్యటన
– మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్ళి బాధితులకు పరామర్శ
గుంటూరు, మహానాడు: కాలనీలు చూస్తుంటే బాధ కలుగుతోంది. 50 ఏళ్ళలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురిశాయి. ఇంటింటికీ వెళ్లి ప్రజల బాధలను విన్నాం. వారికి అవసరమైన పునరావాస ఏర్పాట్లు చేశాం. డ్రెయిన్లు, రోడ్లు సరిగా లేనందున ఇళ్లలోకి సైతం నీళ్లు వచ్చాయి. పక్కా ప్రణాళికతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు చేపడతాం. అవసరమైన వారికి పక్కా గృహాలు నిర్మిస్తాం. బాధితులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
భారీ వర్షాలకు గుంటూరులో నీట మునిగిన ప్రగతి నగర్, జిమ్మి షహీద్ నగర్ ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ ససీర్ అహ్మద్ తో కలిసి పెమ్మసాని ఆదివారం పర్యటించారు. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రతి ఇంటికీ వెళ్లి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ఈ ప్రాంత వాసులకు మంచినీటి కుళాయి కనెక్షన్ ఇప్పించాలని, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని జిమ్మిషహీద్ నగర్ లో నీట మునిగిన ప్రాంతాలను పెమ్మసాని పరిశీలించారు. చిన్న చిన్న వీధుల్లో నుంచి వెళ్లి స్థానికుల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని నివాసాలు అనధికార లే-అవుట్లలో ఉండడంతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించారు. ఈ ప్రాంత ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉండాలని అధికారులకు పెమ్మసాని గారు సూచించారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తహసీల్దార్ నగేష్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వృద్ధులకు భరోసా
* పర్యటనలో భాగంగా శకుంతల అని వృద్ధురాలి ఇంటికి వెళ్లి మరి పెమసాని పరామర్శించారు వరద నీటిలో చిక్కుకున్న ఆమె ఇంటి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
* షేక్ ఖుతూబ్ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఏ దిక్కూలేదని ఆదుకోవాలని కోరగా.. పెమ్మసాని ఆర్థిక సాయం అందించి స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు.