-బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
-కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ జరగదు
-రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం
-బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే
-రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
-పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం
-రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం
-800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన మోదీ
-పలు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభం
-అంబారి- పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్- మౌలాలి మార్గానికి శ్రీకారం
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్‌లో జరుగుతున్న కార్యక్రమాలే నిదర్శనమని స్పష్టం చేశారు. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న ప్రధాని.. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడిన కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారంటే… తెలంగాణ కుటుంబ సభ్యులారా.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించాం. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వికసిత్ భారత్‌పై నిన్న మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దు. వారిలో రెండే అంశాలుంటాయి. కుటుంబ పార్టీల్లో ఉండేది రెండేనని.. ఒకటి దోచుకోవడం.. రెండు అబద్ధాలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోంది.? కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు అనుకుంటున్నారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో కృషి చేస్తోంది. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా?. మోదీ గ్యారంటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం.
రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం. 15 రోజుల్లోనే ఆత్మనిర్భర్ భారత్ నుండి వికసిత్ భారత్ వైపు అడుగులు వేశాము. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి ఓటేయాలి.
బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగింది ఏమీ లేదు..కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలకు ఏమీ జరగదు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. తెలంగాణలో సమ్మక్క-సారక్క యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయింది.
ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుంది. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుంది. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం.