– పొన్నవోలు వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య సీరియస్
స్వామి వారి లడ్డూను ఇత్తడితోనూ, పంది కొవ్వును బంగారంతోను పోల్చి, పంది కొవ్వు ధర కిలో రూ.1400 ఉందంటూ వైసీపీ నాయకులు, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన అశుద్ధ మాటలను వెనక్కి తీసుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు.
పందులను బయట తిరగనిస్తే, ఇలాంటి మాటలే మాట్లాడుతుంటాయని, చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా పొన్నవోలు ఊరూరా తిరిగి చెప్పిన అబద్ధాలను, తెలుగు ప్రజలు మరిచి పోలేదని తెలిపారు. దేవదేవుని సన్నిధిలో లడ్డూ , ప్రసాదాలు అపవిత్రం జరిగినందుకు, భక్తులు తల్లడిల్లుతుంటే, పుండు మీద కారం చల్లినట్లు పొన్నవోలు మాటలు ఉన్నాయని చెప్పారు.
కల్తీ నెయ్యి వాడినట్లు సైంటిఫిక్ లాబ్ ఆధారాలతో ప్రభుత్వం విచారణ చేస్తుంటే, విచారణ ను తప్పు దారి పుట్టించేలా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ నెయ్యికి ద్వారాలు తెరిచారనే విషయాన్ని మింగ లేక కక్క లేక.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేందుకు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ కి రాసిన లేఖలోనూ తన హయాంలో తప్పు చేయలేదు అన్న మాటే రాయలేదని గుర్తు చేశారు. శ్రీవెంకటేశ్వర స్వామి మీద ఎలాంటి అపవిత్రమైన వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎంతటి వారినైనా ఉపేక్షించ వద్దని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.