కేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదు: రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.  ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మోదీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మోదీని రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు.

సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో ఉంటే… రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కేంద్రంతో తాము యుద్ధం చేయదలుచుకోలేదని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు.

మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విన్నవించారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని… అయితే గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1,600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని విమర్శించారు. హైదరాబాద్ కంటోన్మెంట్ లో 175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. రేవంత్ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ… తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.