ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్

-క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-నాగాయలంకలో ఉచిత క్యాన్సర్, గుండె మెగా వైద్య శిబిరం
-ఏపీలో ఏర్పాటు కానున్న బసవతారకం క్యాన్సర్ సెంటర్ 

అవనిగడ్డ, మహానాడు : క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తొలి దశలోనే పరీక్షలు చేయించి వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం నాగాయలంకలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సుదర్శి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత గుండె, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల మెగా వైద్యశిబిరం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఏపీలో బసవ తారకం క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు యోచన
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు సతీమణి నందమూరి బసవతారకం క్యాన్సర్ వ్యాధికి గురైన సమయంలో అమెరికాలో క్యాన్సర్ చికిత్స పొందారని, ఆమెకు ప్రముఖ క్యాన్సర్ వైద్యులు, తెలుగు ఆణిముత్యం డాక్టర్ నోరి దత్తాత్రేయ చికిత్స అందించారని తెలిపారు. తన పరిస్థితి పేదలకు వస్తే ఎలా అని బాధపడిన నందమూరి బసవతారకం సూచనల మేరకు నందమూరి తారక రామారావు హైదరాబాదులో ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు.

నేడు ఆ ఆసుపత్రి నందమూరి బాలకృష్ణ కృషితో ప్రపంచ స్థాయిలో అత్యున్నత ఆసుపత్రిగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నవ్యాంధ్ర ఏర్పాటు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నందమూరి బసవతారకం ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు క్యాన్సర్ వ్యాధి వస్తే వారికి వైద్య సేవలు ఉచితంగా అందాలనే మహోన్నత ఆలోచన చేసిన నందమూరి తారక రామారావు బాటలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ పయనిస్తూ నిత్యం వేలాది మందికి ఉచిత క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ 
క్యాన్సర్ వ్యాధి బారినపడే పేదలు ధనవంతులతో సమానంగా సత్వర వైద్య సేవలు ఉచితంగా పొందాలనే సమున్నత ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేందుకు ఆగస్టు 15 నుంచి ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం దాదాపు రూ.680 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సుదర్శి మానవతా సేవా సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ సేవలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రశంసించారు.

గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయ నాటి వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం ఆచరణలో పెట్టలేదన్నారు. నూతన ప్రభుత్వం పేదలకు క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు విస్తృత కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. సుదర్శి మానవతా సేవా సంస్థ నిర్వాహకులు తలశిల రఘు శేఖర్, కనిగంటి నారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, ఉప సర్పంచ్ తలశిల నాని, తహసీల్దార్ ఎం.హరనాథ్, టీడీపీ, జనసేన నాయకులు గుడివాక శేషుబాబు, వర్రె రాంబాబు, బండ్రెడ్డి హరి పాల్గొన్నారు.