పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాం
వసతి గృహాల్లో ఖాళీలు భర్తీచేస్తాం
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హామీ
అమరావతి, మహానాడు: వైసీపీ అయిదేళ్ల పాలనలో సాంఘిక సంక్షేమ శాఖ అధఃపాతాళంలోకి వెళ్లిపోయిందని, కనీసం వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మూడవ రోజు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని, వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక మంత్రి డా.వీరాంజనేయస్వామి తెలిపారు.
ఎస్.ఎఫ్.ఐ విద్యార్ది సంఘ నాయకులు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు మంత్రిని కలిసి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో కనీసం తమకు వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదన్నారు. సరిపడా ఉద్యోగులు లేక ప్రిన్సిపాళ్లకు అధనంగా ఇతర ప్రాంతాల్లో మరొక పాఠశాలకు ఇన్చార్జిగా నియమించడంతో పని భారంతో ఇబ్బందులు పడుతున్నామని, ఖాళీలు భర్తీ చేయాలని మంత్రిని కోరారు. గత ప్రభుత్వంలో కనీసం తమ సమస్యలు కూడా చెప్పుకునే వీలు ఉండేదని కాదని మంత్రికి తెలిపారు.ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ….త్వరలో ఖాళీలు భర్తీచేస్తామని, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలకు, పూర్వ వైభవం తీసుకొస్తామని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అన్నారు.
అనంతరం ఎస్.ఎఫ్.ఐ విధ్యార్దులు మంత్రిని కలిసి వసతి గృహాల్లో మెస్ చార్జీలు పది నెలలుగా బకాయిలు ఉన్నాయని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, వసతి గృహాల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మంత్రిని కోరారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని మా ప్రభుత్వంలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విద్యార్థులకు ఏ లోటు లేకుండా చూస్తామని మంత్రి అన్నారు.