– ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం
అమరావతి, మహానాడు: ఎన్నికల ఫలితాలపై మాకు ఉన్న అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది… పోలింగ్ రోజు గణాంకాలకు కౌంటింగ్ రోజు గణాంకాలకు తేడా ఎందుకు, ఈసీ స్పష్టత ఇవ్వాలి.. ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్ స్టేటస్‌పై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది… ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి…. 175 నియోజకవర్గాల నుంచి ఫామ్ 20 డేటా ఈసీ ఇప్పటికీ ఎందుకు తెప్పించడం లేదు అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌ను వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం ప్రశ్నించింది. ఈ మేరకు బృందం మంగళవారం ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడింది.
బృందంలో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలపై మేం షాక్‌కు గురయ్యాం.. కానీ ప్రజల తీర్పును అంగీకరించకతప్పదు, ప్రజాస్వామ్య పరిరక్షణపై భారతదేశంలోని అనేక సంస్ధలు ఈ ఎన్నికల నిర్వహణపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాయి. ఓట్ ఫర్ డెమక్రసీ సంస్ధ కూడా ఇదే విధంగా స్పందించింది. దీంతో మా అనుమానాలు బలపడ్డాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఇది రాజ్యాంగబద్దమైన సంస్ధ, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు పూర్తయింది… ఈ లోపు ఆ ప్రాంగంణంలోకి ప్రవేశించేవారికి ఓటు వేసే అవకాశం ఉంది.. కానీ పోలింగ్ తర్వాత ఈసీ కొన్ని గణాంకాలు ప్రకటించింది.
ఆరుగంటల తర్వాత మాకు అందిన సమాచారం ప్రకారం 68.12 శాతం పోలింగ్ నమోదయిందన్నారు… ఆ తర్వాత అదే రోజు రాత్రి 11.45 గంటల ప్రాంతంలో మరో ప్రకటన చేశారు… 76.5 శాతం పోలింగ్ జరిగిందన్నారు.. ఆ తర్వాత ఫైనల్‌గా 80.66 శాతం ప్రకటించారు…. ఆ తర్వాత కౌంటింగ్ రోజు చూస్తే 82 శాతం పైచిలుకుగా చెప్పారు.. దీనిపై అనుమానాలు ఉన్నాయి… కౌంటింగ్ రోజు గణాంకాలు పోలింగ్ రోజు గణాంకాల మధ్య తేడా ఎందుకు వచ్చింది, ఎన్నికలు జరిగినప్పుడు ఇంత శాతం తేడా ఎందుకు వచ్చింది, ఈసీని అనేక సందర్భాల్లో అడిగినా స్పందించడంలేదు… దీనిపై మరోసారి ఇప్పుడు ఈసీని కలిశాం. అంతేకాక ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఏఏ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలియాలి? ఫామ్ 20 ప్రకారం ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ప్రకటించాలి. ఈ రోజుకు కూడా ఆ లెక్కలు ప్రకటించకపోవడం అసాధారణమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం.. రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈసీ వెంటనే స్పందించాలి. విజయనగరం పార్లమెంట్‌కు సంబంధించి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇద్దరూ ఈవీఎంల బ్యాటరీలపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద తతంగం చేశారు. బ్యాటరీలు ఎందుకు చార్జింగ్ పెరిగాయని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు ముందు చెప్పారు. దీనిపై నానాయాగీ చేశారు.. ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు మ్యాచ్ అవ్వాలి కానీ అవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తున్న వారి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. దీనిపై రాతపూర్వకంగా మేం ఫిర్యాదు చేశాం. ఈవీఎంలు భద్రపరిచిన చోట తాళాలు అధికారుల దగ్గర లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఈసీ అథారిటీ మీద అనుమానాలు వస్తున్నాయి.
ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు..
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్ధ, ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ పోయారు. 175 నియోజకవర్గాల నుంచి ఫామ్ 20 తెప్పించుకోవాలి. కానీ ఈ రోజుకూ ఈసీ డేటా తెప్పించలేదు. దీనిపై అనేక సంస్ధలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, ఈసీని త్వరితగతిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాం. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా మీరు స్పందించాలని చెప్పాం. వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్ఆర్సీపీ నేత ఎ.నారాయణమూర్తి, తదితరులు ఉన్నారు.