తాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేశారు

ముండ్లమూరు మండల సమస్యలు పరిష్కరిస్తా
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా ముండ్లమూరు, మహానాడు: ముండ్లమూరు మండలంలో తాగునీటి పథకాలను వైసీపీ నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. ముండ్లమూరు మండలం వేముల గ్రామంలో దర్శి నియో జకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను మీ ఆడబిడ్డను…మీ ఇంటి బిడ్డను.. గొట్టిపా టి వారసురాలిని.. ముండ్లమూరు మండలానికి తమకు అవినాభావ సంబంధం ఉంది..తనను ఆశీర్వదించాలని కోరారు. ముండ్లమూరు మండలంలో సమస్యలు గుర్తించాను.. ముఖ్యంగా తాగునీటి కోసం విలవిలాడుతున్నారని, ఆనాడు హనుమంతరావు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు మూలనప డ్డాయని, కనీస మరమ్మతులు లేక పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు.

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తాగునీటి కోసం నెదర్లాండ్‌ స్కీం మూలన పడిరదని విమర్శించారు. కరెంటు చార్జీలను చూస్తే షాక్‌ కొడుతున్నాయ న్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను దోపిడీ చేశారని, ఒక పక్క ఇస్తున్నామని మరోపక్క లాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేసి అణగారిన వర్గాల ను అభివృద్ధి చేసే దిశగా పని చేస్తుందని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎలా జరిగిందో చూశారు…ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.