– ప్రభుత్వశాఖల్లో డ్రోన్ టెక్నాలజీపై మంత్రికి వివరణ
– ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పిన మంత్రి
అమరావతి, మహానాడు: ప్రభుత్వ రంగంలోని రోడ్లు, భవనాల శాఖ, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర విషయాల్లో డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగాలను డ్రోన్ కంపెనీల యజమానులు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం కలిసి వివరించారు. హైదరాబాద్ కు చెందిన వింగ్స్ అండ్ ప్రాప్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్, సిడాక్ కంపెనీ సీఈఓ ప్రవీణ్ కుమార్ మంత్రి జనార్ధన్ రెడ్డి కి డ్రోన్ టెక్నాలజీతో పనిని ఏ విధంగా సులభతరం చేయవచ్చో వివరించారు. డ్రోన్ టెక్నాలజీపై ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ప్రభుత్వరంగంలోని వివిధ శాఖలకు డ్రోన్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు.
ఈ డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, అర్బన్ ఏరియా డెవలప్మెంట్, డిఫెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మైనింగ్, సర్వేలు, మ్యాపింగ్, సీడ్ బాల్స్ ప్లాంటేషన్ వంటి వివిధ రకాల పనులను సులభతరం చేసుకుని, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు ఏయే రంగాల్లో తమ టెక్నాలజీని వినియోగించి మంచి ఫలితాలు సాధించారో మంత్రికి క్షుణ్ణంగా తెలిపారు.
రానున్న కాలంలో డ్రోన్ హబ్ ఏపీలో ఏర్పాటుకు ఏవిధమైన అవకాశాలు ఉన్నాయో, దీని వల్ల రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూరుతుందో మంత్రికి వివరించారు. ఈ విషయాలన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి భవిష్యత్తులో ముందుకెళ్లే విషయంపై చర్చిస్తామని మంత్రి వారికి తెలిపారు.