Mahanaadu-Logo-PNG-Large

పల్నాడుపై డేగ కన్ను

ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
నరసరావుపేట జేఎన్‌టీయూలో ఏర్పాట్లు పూర్తి
ఉదయం 8 గంటలకు ప్రారంభం
విధుల్లో పాల్గొననున్న 700 మంది సిబ్బంది
పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు
గుంటూరు- కర్నూలు హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు

నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నరసరావుపేట జేఎన్‌టీ యూలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 700 మంది సిబ్బందిని లెక్కింపు కోసం కేటాయించారు. కౌంటింగ్‌ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో పోలీసులు డేగకన్నుతో నిఘా ఉం చారు. కౌంటింగ్‌ కేంద్రానికి ఒక అబ్జర్వర్‌, ఒక మైక్రో అభజర్వర్‌, సూపర్‌వైజర్‌ లు, ఒక ఆర్వోను కేటాయించారు. అధికారుల కింద సబార్డినెట్‌ కోసం మరో 300 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం 14 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు ఏర్పాటు చేయగా ఒక్కో కౌంటింగ్‌ కేంద్రానికి 15 మంది సిబ్బందిని కేటాయించారు.

నరసరావుపేట నియోజకవర్గంలో 245 పోలింగ్‌ బూత్‌లు, 18 రౌండ్‌లు, చిలకలూరిపేట నియోజవర్గంలోని 241 పోలింగ్‌ బూత్‌లు, 18 రౌండ్లు, పెదకూరపాడు నియోజకవర్గంలో 266 పోలింగ్‌ బూత్‌లు, 19 రౌండ్లు, సత్తెనపల్లి నియోజకవర్గంలో 274 పోలింగ్‌ బూత్‌లు, 20 రౌండ్లు, వినుకొండ నియోజక వర్గంలో 299 పోలింగ్‌ బూత్‌లు, 22 రౌండు, మాచర్ల నియోజకవర్గంలో 299 పోలింగ్‌ బూత్‌లు, 22 రౌండ్లు, గురజాల నియోజక వర్గంలో 304 పోలింగ్‌ బూత్‌ లు, 22 కౌంటింగ్‌ రౌండ్లు ఉన్నాయి. జిల్లాలో మొదటగా చిలకలూరిపేట ఫలితం, చివరగా గురజాల ఫలితం రానుంది. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని పల్నాడు కలెక్టర్‌ బాలాజీరావు, ఎస్పీ మల్లికాగార్గ్‌ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నలుగురు అడిషినల్‌ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలను కేటాయించారు. కౌంటింగ్‌ సందర్భంగా గుంటూరు- కర్నూలు హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.