ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి
ఏజెంట్లు కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలి
ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట: అత్యంత ఉత్కంఠభరితంగా మారిన సార్వత్రిక ఎన్నికల ఫలితా లకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రతిక్షణం ఎన్నికల సంఘం పటిష్ఠ నిఘా ఉంచాలని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరా వుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఇప్పటికీ కొందరు అధి కారులు అధికార వైకాపా బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గే ప్రమాదం ఉందని, అలాంటి చోట్ల ఏవైనా సంఘటనలు జరిగితే నిజాలు సమాధి కాకుండా ఈసీ ముందు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ నిఘా ఏర్పాట్లు చూసుకోవాలని కోరారు.
కౌంటింగ్ సమయంలో ఆయా బూత్‌లకు ఏజెంట్లుగా ఉన్నవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో కౌంటింగ్ కేంద్రాల ఏజెంట్లకు అవగాహన నిర్వహించారు. ఏజెంట్లకు ఈసీ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అనుమానం వస్తే వెంటనే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. వైకాపా నుంచి ఎవరైనా రెచ్చగొట్టాలని చూసినా సంయమనం పాటించి వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. కౌంటింగ్ పూర్తిగా ముగిసి అభ్యర్థులంతా గెలుపు డిక్లరేషన్లు అందుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.