– భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
– నైపుణ్య శిక్షణ ద్వారా అవసరమైన మ్యాన్ పవర్ తయారీ
– న్యూయార్క్ పెట్టుబడిదారుల సమావేశంలో లోకేష్
– ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్ళిన మంత్రి
న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్ లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటన చివరిరోజున మంత్రి లోకేష్ న్యూయార్క్ లోని విట్ బై హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్ మహానగరంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన మంత్రి లోకేష్ మాట్లాడారు.
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు భారత్ లో ఏ రాష్ట్రంలోని అనుకూల వాతావరణం ఏపీలో ఉంది. 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురం వద్ద జీఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. దీంతో పాటు రాష్ట్రంలో మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో నాలుగు కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనిద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తాం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యతోపాటు యువతకు ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయబోతున్నాం. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయస్థాయి ఏఐ నిపుణులు తయారవుతారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని మంత్రి లోకేష్ చెప్పారు. పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా లోకేష్ అమెరికా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తిచేశారు.
ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సిఇఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్ & సిఇఓ, యుఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్, రాబర్ట్ టిచియో (సిఇఓ, ఫోర్టెస్క్ క్యాపిటల్, సంజయ్ పటేల్ (వైస్ చైర్మన్, అపోలో క్యాపిటల్), రిచర్డ్ డ్రెస్డేల్ తదితరులు పాల్గొన్నారు.