సభ్యత్వాన్ని పెంచి, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

– పార్టీ సీనియర్ నేత జూపూడి రంగరాజు

గుంటూరు, మహానాడు: భారతీయ జనతా పార్టీ-2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం పై “వాజపేయి భవన్” గుంటూరు జిల్లా కార్యాలయంలో ధార్మిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు విధి విధానాల్ని పార్టీ కార్యకర్తలు, ధార్మిక సంఘాల, బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంఘాల ప్రతినిధులకు వివరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని అత్యధిక స్థాయిలో పెంచుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.

సాధారణ సభ్యత్వం నుండి, క్రియాశీలక సభ్యత్వం వరకు అత్యధిక సంఖ్యలో చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ధార్మిక విభాగం నుండి ప్రతి జిల్లా నుండి కూడా 10,000 సంఖ్య తగ్గకుండా సాధారణ సభ్యత్వాన్ని చేయాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా 100 మందిని సాధారణ సభ్యులుగా చేర్చాలన్నారు. తద్వారా క్రియాశీలక సభ్యత్వాన్ని ఎక్కువగా పొందవచ్చని అన్నారు.

సమావేశంలో నాయకులు టి. అనంతచార్యులు, వెలగలేటి గంగాధర్, పి.రంగవల్లి, ధార్మిక విభాగం జిల్లా కన్వీనర్ ప్రతాప ప్రసాద్, ఏలూరి లక్ష్మీ, డాక్టర్ స్రవంతి, పొన్నపల్లి సోమశేఖర్, అంకరాజు నరసింహమూర్తి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి వచ్చిన బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు.