– మంత్రి మండిపల్లి
సంబేపల్లి, మహానాడు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సంబేపల్లి మండలం, దేవపట్ల గ్రామంలో మంగళవారం సిమెంటు రోడ్డు నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు ఏడు రోజులపాటు పల్లెపండుగ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో మంచినీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పల్లెపండుగ వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొబ్బరికాయ కొట్టి సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.