-మోదీ, అమిత్‌షా, రేవంత్‌కు ఒక న్యాయం…
-కేసీఆర్‌కు ఒక న్యాయమా?
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మహానాడు: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోందని మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాం. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసినా సరే వారిపై చర్యలు లేవు. బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై డైరెక్ట్‌గా విషం చిమ్ముతూ పోస్టులు చేస్తున్నారు. ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా మోదీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దాదాపు 20 వేల ఫిర్యాదులు వచ్చాయి. కనీసం ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేదు. మోదీకి భయపడి బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో అమిత్ షా దేవుడి ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తే ఆయనపై చర్యలు లేవన్నారు.
బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో రాముడి ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు చేసినా, అమిత్ షా దేవుడి ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడిగిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోదు. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం…ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు. తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చాలా అధ్వానంగా మాట్లాడారు. ఆయన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? రేవంత్ రెడ్డి మీద 27 ఫిర్యాదులు చేశాం. ఒక్క దానిపై చర్యలు లేవు. కేసీఆర్ సభలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. చోటాభాయ్, బడా భాయ్ మోసాలను రోడ్ షోలలో కేసీఆర్ ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారు. మోడీ, నడ్డా, రేవంత్‌రెడ్డిలకు నోటీసులు ఇవ్వటానికి ఈసీ ఎందుకు భయపడుతోంది.
మార్చి 18న ఓయూలో నీటి కొరత, కరెంట్ సమస్యకు సంబంధించి సీఎం ప్రజలను తప్పుదోవ పట్టించారు. చీఫ్ వార్డెన్ స్టాంప్‌ను కూడా మార్చేసిండు. సీఎం తప్పుడు డాక్యుమెంట్ పెట్టాడు. తప్పు చేసింది సీఎం అయితే… మా నాయకుడు క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారు. అసలు జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్ రెడ్డా? అది తప్పని చెప్పిన క్రిశాంకా? నేను చెప్పింది తప్పు అయితే చంచల్‌గూడ జైలుకు వెళ్లటానికి సిద్ధం. లేదంటే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడా?
ఈ ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో బయటపెడుతున్నందుకు క్రిశాంక్ మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలని, క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలి. కోర్టులో దీనిపై మేము పోరాడుతాం. సీఎం ఫేక్ డాక్యుమెంట్ చేశారని ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టాలని ఓయూ విద్యార్థులు కూడా ఫిర్యాదు చేశారు. ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేసినందుకు ఈసీ ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. ఈసీ కచ్చితంగా మోదీ, రేవంత్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.