ఎన్నికల్లో ఓటమి పాలైన సినీ తారలు

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది. 400 సీట్లు టార్గెట్ గా బరిలోకి దిగిన బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చి్ంది. దీంతో ఎన్డీయే కూటమి 293, ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలతో పాటు,పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పలువురు సెలబ్రిటీలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొందరు నటీనటులు ఓటమి పాలయ్యారు.
నటి రాధిక
తమిళనాడులోని విరుదునగర్‌ లోక్‌సభకు బీజేపీ నుంచి సినీ నటి రాధికా శరత్ కుమార్ పోటీ చేశారు. అయితే డీఎండీకే నుంచి దివంగత నటుడు విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
నవనీత్ కౌర్ రానా
మహారాష్ట్రలో అమరావతి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రానా ఓడిపోయారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 19వేల731 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాంఖడేకు 5,26,271 ఓట్లు, నవనీత్ రానాకు 5,06,540 ఓట్లు పోలయ్యాయి. నవనీత్ తెలుగులో పలు సినిమాలు చేశారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా హైదరాబాద్ లో ప్రచారం కూడా చేశారు.
రోజా
ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ బరిలో పోటీ చేసిన మంత్రి ఆర్‌కే రోజా ఓటమిపాలయ్యారు. తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై 5, 333 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
స్మృతి ఇరానీ
అమేథీలో పోటీ చేసిన స్మృతి ఇరానీ కాంగ్రెస్​ అభ్యర్థి కిశోరీ లాల్ ​చేతిలో ఓటమి పాలయ్యారు. 1.8లక్షల ఓట్ల తేడాతో స్మృతి ఇరానీపై విజయం సాధించారు.
దాసరి సాహితి
మా ఊరి పొలిమేర సిరీస్ లతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి సాహితి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.