లంచం కేసులో విద్యుత్ ఏడీఈకి నాలుగేళ్ల జైలుశిక్ష

కరీంనగర్‌: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కిన విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ అనిశా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వం తత్కాల్‌ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్‌ సరఫరా చేస్తుందని తెలిసి మరికొంత మంది రైతులతో కలిసి 2010 అక్టోబరు 12న విద్యుత్‌ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్‌ విద్యుత్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ రేగుంట స్వామికి చేరడంతో వెళ్లి ఆయనను కలిశారు. ఆయన రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో రూ.15 వేలకు కుదుర్చుకున్నాడు. దీంతో రైతులు 2010 నవంబరు 18న అనిశా అధికారులను ఆశ్రయించగా డబ్బులు ఇస్తుండగా పట్టుకుని పట్టుకుని కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిషోర్‌ కుమార్‌ వాదించారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి పై తీర్పు చెప్పారు