బుడమేరు, కొల్లేరుల్లో ఆక్రమణలు తొలగించాలి

– బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటనలో అసలు దోషులను పట్టుకోవాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
– `కొల్లేరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
`- ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఐ బృందం

విజయవాడ: ఇటీవల భారీ వర్షాలతో బుడమేరు, కొల్లేరులకు వరదలు రావటానికి కారణమైన ఆయా పరివాహక ప్రాంతాలోని ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ గేట్లను భారీ పడవలు ఢీకొన్న ఘటనా ప్రాంతాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణల సారధ్యంలోని సీపీఐ బృందం మంగళవారం పరిశీలించింది.

ఈ సందర్భంగా నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ 150 టన్నుల ఇసుకను తీసుకెళ్లగలిగిన దాదాపు 60టన్నుల బరువు ఉన్న ఐదు పడవలు బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయని చెప్పారు. ఒకటి కొట్టుకు పోగా మరోకటి నీటి అడుగున ఉందని, మూడు పైకి కనబడుతున్నాయని చెప్పారు. ఈ పడవలు ఎవరికి చెందినవో నిజమైన దోషులను విజిలెన్సు అధికారులు పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, బీసీలు తమవి అంటూ వస్తున్నారని వారందరూ బినామీలు మాత్రమే అన్నారు.

పడవలకు ఉన్న రంగును బట్టి అవి ఖచ్చితంగా వైసీపీకి చెందిన వాళ్లవిగా అర్థమవుతుందన్నారు. కొందరు బోట్లు గట్టిగా ఢీకొని బ్యారేజీ గేట్లు విరిగిపోతే ఏమైయ్యేదంటూ అతిశయోక్తిగా ప్రచారం చేయటం మంచి కాదన్నారు. ఈ ఘటన వెనుక మాఫీయా గ్యాంగ్‌ ఉందని వారిని బయటకు తీసుకువచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

చంద్రబాబు నాయుడు అధకారంలోకి వస్తే సహజంగా కరువు వస్తుందని, ఇప్పుడు అతివృష్టి వచ్చి ఇళ్లు, పంటలు కొట్టుకుపోయాయని ఎద్దేవ చేశారు. తమ బృందం కొల్లేరును పరిశీలించిందన్నారు. ఆ ప్రాంతంలో పై నుంచి ఏలూరు కాల్వ, కింద నుంచి బుడమేరు ప్రవహించేలా బ్రిటీష్‌ వాళ్లు అక్విడెట్టు నిర్మించారని చెప్పారు. ఆ నిర్మాణం నేటి అవసరాలకు సరిపోదన్నారు. వంతెన ఎత్తు పెంచాలని, వెడల్పు చేయాలని సూచించారు. ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిదికన నిర్మాణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ వరదలు వచ్చిన సందర్భంగా విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పది రోజులు తిరిగి అన్ని సౌకర్యాలు కల్పించారని, మంచి ప్రచారం కూడా లభించిందన్నారు. గ్రామాల్లో ప్రజలు నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

అధికారులు ఎవరూ రాలేదని, సహాయం అందించలేదని ప్రజలు తమ వద్ద వాపోయారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి రెండు రోజుల పాటు పర్యటించి అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారని చెప్పారు. పంట నష్టపోయిన వారికి ఇంకా ఎన్యూమరేషన్‌ చేయలేదన్నారు. కొల్లేరు ప్రాంతాన్ని కోటీశ్వర్లు, చేపలు, రోయ్యలు వ్యాపారం చేసే బడా వ్యాపారవేత్తలు ఆక్రమించారని చెప్పారు.

ఐదవ కాంటూరు వరకు ఉన్న కొల్లేరు అభయారంణ్యాన్ని కాపాడటం కోసం77 వేల ఎకరాల విలువైన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు ఆక్రమణలకు సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు చెప్పారు. అవసరమైతే కొల్లేరు సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని వివరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, అక్కినేని వనజ, ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్‌ బాబు, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, కృష్ణా జిల్లా కార్యదర్శి టి.తాతయ్య, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడియ్య, కొట్టు రమణారావు, మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు శ్యామల, కార్యదర్శి యామిని తదితరులు పాల్గొన్నారు.