* ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో మొక్కను నాటి పర్యావరణను పరిరక్షిద్దాం – – జిల్లా కలెక్టర్ డా.జి. సృజన
గుంటుపల్లి: మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని తల్లిపై ఉన్న ప్రేమ గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడినవారమవుతామని జిల్లా కలక్టర్ డా.జి. సృజన అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పెద్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ జి. సృజన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మొక్కలను నాటారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా అనేక సమస్యలను ఎదురుకోవలసి వస్తుందన్నారు. ముఖ్యంగా తుఫాన్, ఉప్పెన, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షణ వాతావరణ సమతుల్యానికి మొక్కలు నాటడమే ప్రధాన కర్తవ్యమన్నారు. 2025 మార్చి నాటికీ దేశ వ్యాప్తంగా 140 కోట్ల మొక్కలను నాటలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరూ వారి తల్లిపై ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగానికి గుర్తుగా ఒక మొక్కను నాటడం ద్వారా తల్లిని గౌరవించుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు చెరువు గట్లు కాలవ గట్లు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జె. సునీత మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో కొబ్బరి, మామిడి, జామ, నిమ్మ, సపోట, నారింజ, సీతాఫలం, నేరేడు వంటి ఫల మొక్కలతో పాటు మల్లె, గులాబి, మందారం తదితర పూల మొక్కలను నాటి విద్యార్థులను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో రామకృష్ణ నాయక్, గ్రామ సర్పంచ్ బి. కవిత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. సుధారాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్లాంట్ మేనేజర్ కె. ఉషా, ఏపీవో ఎం. ప్రమీల, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.