-ఎలక్ట్రోరల్ బాండ్లతో రాబట్టుకోవడమే లక్ష్యం
-మళ్లీ వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు ఖాయం
-టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్
హైదరాబాద్, మహానాడు: దేశంలో ప్రస్తుతం మోదీ టాక్స్ నడుస్తుందని, దేశ ప్రజల నుంచి వసూలు చేసిన టాక్స్‌ను 21 మంది పారిశ్రామిక వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడని, ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్ల నుంచి ఆ టాక్స్ తీసుకుంటున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని ఎత్తివేసేందుకు కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోదీ ప్రజలను కోరుతు న్నాడని విమర్శించారు. సంపన్నులు, బడా కార్పోరేట్లకే తప్ప పేద ప్రజలకు మోదీ ఏం చేశాడో చెప్పలేని స్థితిలో ఉన్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేస్తాం, పడగొడతామంటూ బీఆర్‌ఎస్, బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయని, అందుకే తాము ఆ పార్టీల నుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. వారు తోడేళ్లు, నక్కలనే కాదు…రాబంధులను తినేవారని ఆరోపిం చారు.