త్వరితగతిన బైపాస్, రహదారుల నిర్మాణాలు

– సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని, ఎన్ హెచ్ ఏ ఐ పీడీ తో పెమ్మసాని

గుంటూరు, మహానాడు: కాజా – గొల్లపూడి, చిలకలూరిపేట బైపాస్ నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి… పెదకాకాని వద్ద గుంటూరు ప్రవేశ మార్గం టెండర్ల పని పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్. ఏ. ఐ) గుంటూరు పి.డి పార్వతీశం గుంటూరులోని స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా పెదకాకాని నుంచి గుంటూరు లోకి ప్రవేశించే మార్గం ఏర్పాటు చేయడంపైన నేషనల్ హైవే అధికారులతో పెమ్మసాని మాట్లాడారు. గుంటూరులోకి రాకపోకలు సాగించే విధంగా ఆ మార్గాన్ని సుగమం చేయాలని, త్వరలోనే టెండర్లు పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే గుంటూరు పరిసరాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గతంలో ప్రారంభమైన, ప్రారంభం కాకుండా ఆగిన పలు నిర్మాణాలన్ని త్వరలో పూర్తి కావాలని పెమ్మసాని ఆదేశించారు.

రాజధాని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు జరుగుతున్నాయని, వందలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ తరుణంలో ప్రస్తుతం కరకట్ట మార్గం ఒకటే అందుబాటులో ఉంది. ఈ క్రమంలో భవిష్యత్తు రద్దీ దృష్ట్యా రాజధాని ప్రాంతాల్లో రాకపోకలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంపై పెమ్మసాని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటేనే పనులు వేగవంతం అవుతాయని ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అవసరమైనా తాను సహకరిస్తానని పెమ్మసాని ఈ సందర్భంగా తెలిపారు.