-సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కు సర్కారు నోటీసు
అమరావతి: జగన్ జమానాలో ఆయన అండ చూసుకుని చెలరేగిపోయి.. వృద్ధుల నుంచి యువకుల వరకూ కేసులతో వేధించిన, సీఐడీ మాజీ దళపతి సునీల్‌పై సర్కారు క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆయనపై నమోదైన అభియోగాలకు, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనితో సునీల్‌పై చర్యల కొరడా ఖాయమని స్పష్టమవుతుంది.
టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నగరంపాలెం పీఎస్ లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని, జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.1695 తీసుకువచ్చింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.