Mahanaadu-Logo-PNG-Large

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు!

-తాడేపల్లి, సీతానగరం వారుగా గుర్తింపు
-పోలీసుల అదుపులో ఆరుగురు?
-కేసును నీరుగార్చే పనిలో ఓ ఏఎస్‌ఐ

నకలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా వ్యవహారం రట్టయింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరానికి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చలామణి చేస్తుంది. ఈ ముఠా రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారితో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు శనివారం మిర్యాల గూడలో అసలు నోట్లు తీసుకుని కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించింది. విజయవాడ సమీపంలోని సూరాయిపాలెం వద్దకు వచ్చి ఇరువర్గాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆకస్మికంగా పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న తెల్లటి స్కార్పియో కారులో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి పోలీసుల పేరుతో హడావుడి చేశారు. ఈ వ్యవహారాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించడంతో కొందరు స్కార్పియో కారులో పారిపోగా, ఓ కారును వదిలేసి వెళ్లారు. కంగుతిన్న మిర్యాలగూడ వాసులు ఏం చేయాలో పాలుపోక ఆస్పత్రికి వెళుతుండగా వెంబడిరచి దోపిడీకి ప్రయత్నం చేసి ప్లేటు ఫిరాయించినట్లు సమాచారం.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నకిలీ పోలీసులు వదిలి వెళ్లిన కారు ను స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు నకలీ కరెన్సీ వ్యవహారం గురించి తెలుసుకున్నారు. మిర్యాలగూడ వారు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అరెస్టు అయిన ఓ నిందితుడు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసును నీరుగార్చేందుకు గతంలో విజయవాడ సీసీఎస్‌లో పనిచేసిన ఓ ఏఎస్‌ఐగా విశ్వప్రయత్నాలు చేసినట్లు సమా చారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.