చింతలపల్లిలో 107 ఎర్రచందనం దుంగల పట్టివేత

లగేజ్‌ ఆటో, మోటారుసైకిల్‌ స్వాధీనం
ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది

ప్రకాశం జిల్లా: కొమరోలు మండలం చింతలపల్లి అటవీ పరిధిలో 107 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో కడప సబ్‌ డివిజన్‌ ఆర్‌ఐ చిరంజీవులుకు చెందిన ఆర్‌ఎస్‌ఐ నరేష్‌ టీమ్‌ కడప నుంచి కూంబింగ్‌ చేపట్టింది. సమీపంలోని ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను తనిఖీ చేశారు. తర్వాత కడప నుంచి కొమరోలు చేరుకుని చింతలపల్లి అటవీ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా సోమవారం రాత్రి భైరవస్వామితిప్ప వద్ద ఒక ఆటో, ఒక మోటారుసైకిల్‌ అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని చుట్టు ముట్టే ప్రయత్నంచేయగా కొంతమంది అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో ఇద్దరిని టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది పట్టుకోగలిగారు.

వారిని తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన రాజేంద్రన్‌ కుమార్‌ (41), ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటకు చెందిన వాసం వెంకటసుబ్బయ్య(43)లుగా గుర్తించారు. వారి నుంచి ఆటోలో లోడ్‌ చేస్తున్న 107 ఎర్రచందనం దుంగలు, ఒక లగేజి ఆటో, మోటారుసైకిల్‌, మూడు సెల్‌ఫోన్లు, రూ.30,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని తిరుపతి టాస్క్‌ ఫోర్సు పోలీసుస్టేషన్‌కు తరలించి బుధవారం కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎస్‌ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. అడవుల్లోకి పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ చేపడుతున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులకు సిఫారసు చేస్తున్నట్లు చెప్పారు.