– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, మహానాడు: ఆగస్టు 15 సందర్భంగా ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7న అన్ని జిల్లాల్లో హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహణ కోసం విధివిధానాలపై చర్చించడం జరిగింది. ఆగస్టు 8, 9 తేదీల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసేలా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆగస్టు 10, 11 తేదీల్లో స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల వద్ద శుభ్రం చేసి ఆ మహనీయులకు నివాళులర్పించి, స్మరించుకునేలా ఏర్పాట్లు చేసుకునేలా నిర్ణయం తీసుకున్నాం.
ఇదిలావుండగా, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. స్మారక చిహ్నాల వద్ద స్వచ్ఛ భారత్ కింద పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 11, 13 తేదీల్లో జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ కేంద్రాలు, ప్రతి మండలం, మున్సిపాలిటీల స్థాయిలో యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఆగస్టు 12న మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళలతో బైక్ ర్యాలీల నిర్వహణ. ఆగస్టు 13-15 వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఇల్లు, భవనాన్ని సందర్శించి, ప్రజలందరు “హర్ ఘర్ తిరంగ’లో భాగస్వాములయ్యేలా చూడాలి. ఆగస్టు 13వ తేదీన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని ప్రముఖమైన, ప్రసిద్ధగాంచిన ప్రాంతాల్లో సంఘసేవకులు, ప్రముఖులను సమీకరించి, సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపడుతాం. ఆగస్టు 14న ‘విభజన గాయాల స్మారక దినం’ భారతదేశ విభజన ఘోరమైన ఉచకోతలతో కూడిన, ప్రజలు ప్రాణాలరచేత పెట్టుకొని ఇల్లు, వాకిలి వదిలిన విషాద గాథగా మిగిలిన చీకటి అధ్యాయాన్ని జిల్లా కేంద్రాల్లో హాల్ మీటింగ్స్ నిర్వహించి ప్రజలందరికీ తెలియజేసేలా కార్యక్రమాలు చేపడుతాం. ఆగస్టు 15న రాష్ట్రంలో ప్రతి బూత్ లో, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం.
తెలంగాణ రాష్ట్రంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అర్హులైన రైతులందరికీ అమలు చేయకుండా మోసం చేసింది. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేలా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు అద్భుత స్పందన వస్తోంది. ప్రతిరోజు వేలాది మంది బాధిత రైతుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో ప్రతి జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. రచ్చబండ కార్యక్రమాల అనంతరం రైతుల సమస్యల పరిష్కారం కోసం, రైతులకు ఇచ్చిన 7 ప్రధాన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రశ్నించేలా, గోసపడుతున్న రైతులకు న్యాయం జరిగేలా సమావేశాలు నిర్వహిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయమత్తేలా కార్యాచరణను రూపొందించుకునేలా విస్తృత చర్చ జరిగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణమయ్యేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నాం. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ పరంగా సిద్ధమయ్యేలా విస్తృత చర్చ జరిపి, అనేక నిర్ణయాలు తీసుకున్నాం.