చీఫ్ సెక్రటరీ వెంటనే ప్రకటన చేయాలి
తీవ్రమైన ఎండల నేపథ్యంలో చర్యలు చేపట్టాలి
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్
మంగళగిరి, మహానాడు : ఎండల నేపథ్యంలో మే 1నే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెర్ఫ్ సీఈఓ, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతో గత నెలలో పింఛన్‌దారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారన్నారు. ముఖ్యమంత్రి మాటల్లోనే 60 మంది చనిపోయినట్లు సాక్షిలో వార్తలు వచ్చాయని తెలిపారు. వారి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శవరాజకీయాలకు పింఛన్‌దారుల బలి
మార్చి చివరి వారంలో రూ.14 వేల కోట్లు వైసీపీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించడంతో ఏప్రీల్ లో పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకుండా పోయాయని, దాంతో పింఛన్ల కోసం వృద్ధులు ఎండలో అవస్థలు పడి వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సిబ్బంది ఉన్నా శవరాజకీయాలకు పూనుకుని శవాలను కళ్ల చూశారన్నారు. గతంలో జరిగిన తప్పు జరగకుం డా డబ్బును అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీపై వెంటనే చీఫ్ సెక్రటరీ ప్రకటన చేయాలని కోరారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేలా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసి కోరుతామని తెలిపారు.
చీఫ్ సెక్రటరీ తప్పుకోవాలి
చీఫ్ సెక్రటరీ తప్పుడు నిర్ణయాలతో తీవ్ర ఎండలో పింఛన్‌దారులు ఇబ్బంది పడ్డారు. జగన్ కేసుల్లో సహ నిందితుడైన సెర్ఫ్ సీఈఓ మురళీధర్ తీసుకున్న నిర్ణయంతోనే 60 మంది వృద్ధ పింఛన్ దారులు మృతిచెందారు. జరిగిన ఘటనకు బాధ్యత వహించి చీఫ్ సెక్రటరీ నైతికంగా తప్పుకోవా లన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచి ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు.