-దోపిడీదారులు, భూ కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్ రెడ్డి
-ఫ్యాన్‌ని చిత్తు చేసి చెత్త ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం
-కుట్ర దారుల నుండి ప్రజల్ని రక్షించేందుకే కూటమిగా వస్తున్నాం
-ప్రజల భూములపై హక్కుల్ని కూడా వారికి లేకుండా చేస్తున్నాడు
-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర చేశాడు
-దోపిడీ కొనసాగదనే భయంతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు
-కాలు కదిపినా కప్పం కట్టమనే వ్యక్తి నూజివీడు ఎమ్మెల్యే
-చింతలపూడి లిఫ్ట్ పూర్తి చేస్తా.. నూజివీడు మామిడి తీపి ప్రపంచానికి చాటిచెబుతా
-నూజివీడు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు
నూజివీడు : మరో తొమ్మిది రోజుల్లో జరిగే పోలింగు నాడు జగన్ రెడ్డి అరాచకాన్ని, అహంకారాన్ని అణచివేసేందుకు సిద్ధమా. ఇక్కడి ఊపు చూస్తున్నా, ప్రజల జోష్ చూస్తున్నా కూటమి గెలుపు కళ్ల ముందు కనిపిస్తోంది. ఐదు సంవత్సరాల అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ముందుకు రావాలి. ఐదేళ్లలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయా? నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయో గమనించారా?
జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి. కానీ, చేతలు మాత్రం గడప కూడా దాటవు. అహంకారి, మోసకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుల ముఠా నాయకుడు ఈ జగన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రజల సంపదంతా అతని దగ్గరే ఉండాలనే యింత ఈ జగన్ రెడ్డి. వేసే చిల్లరతో ప్రజలంతా సరిపెట్టుకోవాలనేలా వ్యవహరిస్తున్నాడు. 13వ తేదీన ఫ్యాన్‌ని చిత్తు చిత్తుగా చితక్కొట్టి చెత్తబుట్టలో పడేయాలి.
రాతియుగం పోవాలి.. స్వర్ణయుగం రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి. నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసైనికులు, బీజేపీ నాయకులు ప్రజల కోసం నిలుస్తున్నారు. మనం కూటమిగా ఈ కుట్రదారుల అరాచకాల్ని కూల్చివేసేందుకు పని చేయాలి. ప్రజల భూములకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలపై ఈ జగన్ రెడ్డి ఫోటో ఏంటి?
మన భూములపై ఈ జగన్ రెడ్డి పేరేంటి? అదేమన్నా అతని తాత ఇచ్చాడా? ఇలాంటి చెత్త నిర్ణయాలను చెత్తలో పడేసే రోజులు మరో పది రోజుల్లో రాబోతున్నాయి. పేదలకు ఉండే సెంటు బూమిపై కూడా ఈ జగన్ రెడ్డి పేరుతో పెట్టుకుంటాడంట.
ల్యాండ్ టైటిలింగ్ అని తెచ్చాడు. భవిష్యత్తులో ఎలాంటి భూ రికార్డులు మీ దగ్గర ఉండవు. అడంగల్ లేదు. పట్టా పాస్ పుస్తకాలు లేవు. మొత్తం తన దగ్గర పెట్టుకుని జిరాక్సు ఇస్తాడంట. దాంతో ఏం చేసుకోవాలి. ప్రజల ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టుకుని జిరాక్సు యజమానులకిస్తారా? అమెరికాలో ఉండే క్రిటికల్ రివర్ టెక్నాలజీ అనే కంపెనీ మీ రికార్డులన్నీ మెయింటెయిన్ చేస్తుందంటున్నాడు. ఆ కంపెనీ మీ రికార్డు మార్చేస్తే పరిస్థితి ఏంటి?
నవంబర్ 1, 2023 నుండి చట్టం అమల్లోకి తెచ్చాడు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అని ఒకరిని పెడతాడంట. మీ భూమిపై ఒక బినామీ రికార్డులు మార్చేస్తే ఇక వారిదేనంట ఆ భూమి. ఇలాంటి దుర్మార్గమైన చట్టాలను ఎప్పుడైనా చూశామా? ప్రజలకు చెందిన భూమిపై కన్నేసి, మొత్తాన్ని కబ్జా చేసేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు. తండ్రులు, తాతల నుండి వచ్చిన భూముల పత్రాలపై అతనికేంటి హక్కు?
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల ఆస్తులపై హక్కులు రాయించుకుంటావా? అందుకే ప్రజలంతా అంటున్నారు.. హలో ఏపీ బైబై వైసీపీ. ఇలాంటి నల్ల నల్ల చట్టాన్ని చిత్తు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ నూజివీడు సాక్షిగా చెబుతున్నా. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను. రెండో సంతకం జగన్ రడ్డి తెచ్చిన ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయడానిక పెడతాను.
సైకో జగన్.. ప్రజల ఆస్తుల్ని తన చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. మన మెడకు ఉరితాడు బిగించి, ఆ తాడు తన దగ్గర పెట్టుకోవలనుకుంటున్నాడు. జగన్ రెడ్డి అరాచకానికి ఉరివేసేందుకు ప్రజలు ఫిక్స్ అయిపోయారు. మే 13న జగన్ రెడ్డి వైసీపీకి, జగన్ రెడ్డి నియంతృత్వానికి ఉరివేస్తాం. ఆ రోజు నుండి ప్రజల జీవితాలకు నాది గ్యారెంటీ. అప్పటి నుండి మన అభివృద్ధి అన్ స్టాపబుల్.
అమరావతిని దేశంలోనే అగ్రస్థాయి రాజధానిగా నిర్మించాలని తపించాను. కానీ, ఈ దుర్మార్గుడు వచ్చీ రాగానే అమరావతిని నాశనం చేసి మూడు ముక్కలాట ఆడాడు. ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మార్చాను. అమరావతి పూర్తై ఉంటే.. ఔటర్ రింగు రోడ్డు నూజివీడు పక్క నుండి వెళ్లేది. ఔటర్ రింగు రోడ్డు రద్దు చేశాడు. ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
అధికారంలోకి రాగానే.. అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాను. జగన్ రెడ్డికి విధ్వంసం మాత్రమే తెలుసు. నాకు తెలిసింది అభివృద్ధి మాత్రమే. దోపిడీ సామ్రాట్ ఈ జగన్ రెడ్డి. కృష్ణా నది పక్కనే ఉన్నా.. ఇసుక అందుబాటులో లేకుండా పోయింది.
గతంలో రూ.1000కి అందే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు రూ.5000 అయింది. 40 వేల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేశాడు. గతంలో రూ.60 ఉన్న మద్యం క్వార్టర్ నేడు రూ.200 అయింది. పెంచిన రూ.140 ఎవరి జేబుల్లోకి పోతోంది. ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఎర్రచందనం ఇలా జగన్ రెడ్డి చేయని దోపిడీ లేదు.
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఈ జగన్ రెడ్డి.. పేదలు పెత్తందారులు అంటున్నాడు. రాష్ట్రంలోని ప్రజల ఆస్తులు కొల్లగొట్టి తాడేపల్లి కొంపకు తరలించుకుంటున్నాడు. జగన్ రెడ్డికి ప్యాలెస్ లు కావాలి. పేదలకు మాత్రం.. అగ్గిపెట్టెల్లాంటి ఇల్లా? ఇదేమైనా జగన్ రెడ్డి జాగీరా? వేల కోట్ల ఆస్తులు, పదుల కొద్దీ ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ రెడ్డి పేద వాడంట. మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు.. ప్రతి ఒక్కరి జీవితాలు మారుస్తా.
ఆదాయం సృష్టించి దాన్ని అందరికీ పంచుతాను. ఆడబిడ్డ నిధితో నెలకు రూ.1500 చొప్పున ప్రతి మహిళకూ అందిస్తాను. తల్లికి వందనంతో ప్రతి బిడ్డకూ రూ.15 వేలు అందిస్తాను. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాను. ప్రతి మహిళకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తాను. డ్వాక్రా సున్నా వడ్డీ రుణాలు రూ.10 లక్షల వరకు ఇస్తాను. జగన్ రెడ్డి రూ.10 ఇచ్చి రూ.100 దోపిడీ చేస్తున్నాడు.
డబ్బులివ్వడం కాదు, ఇచ్చిన డబ్బులను పెట్టుబడిగా పెట్టి మరింత ఆదాయం సంపాదించే మార్గాలు చూపిస్తాను. రూ.200 పెన్షన్ రూ.2000 చేసింది తెలుగుదేశమే. ఈ సైకో రూ.1000 నుండి రూ.3000 చేశాను అంటున్నాడు. ఎప్పుడు పెంచావ్, ఎక్కడ పెంచావ్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే పెన్షన్ మొత్తాన్ని రూ.4000కు పెంచి ఏప్రిల్ నుండే అమలు చేస్తా.
దివ్యాంగులకు రూ.6000 చొప్పున అందిస్తాను. చంద్రన్న బీమా రూ.10 లక్షల వరకు ఇస్తాను. రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తాను. మన మేనిఫెస్టో చూసి భయపడి ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. అందుకే నేనొస్తే పథకాలు తీసేస్తానంటూ డ్రామాలాడుతున్నాడు. జగన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిచ్చాను. ఇకపై ఇస్తాను కూడా. పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించి తీరుతాను.
అధికారంలోకి వచ్చాక సంపద సృష్టించి, ప్రతి రూపాయి పేదలకు పంచి పెడతా. వారి ఆదాయం, ఆస్తులు పెంచుతాను. మా మేనిఫెస్టో చూసినప్పటి నుండి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అతని భయం పేదల గురించి కాదు. ఇసుక దోపిడీ పోతుంది. మద్యం దోపిడీ పోతుంది. ఖనిజ సంపద దోపిడీ పోతుంది. భూములు కొట్టేయం కుదరదనే భయంతోనే ఏదేదో వాగుతున్నాడు. ఈ రోజు చెబుతున్నా.. జగన్ రెడ్డి దోచుకున్న మొత్తాన్ని కక్కించి తీరుతా.
నూజివీడులో పనికిమాలిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడు సార్లు గెలిచినా.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైకి వచ్చి దాడులకు తెగబడ్డాడు. జగన్ రెడ్డికి, ఈ ఎమ్మెల్యేకి వడ్డీతో సహా చెల్లించి తీరుతాను. ఇసుక మట్టి దోచుకుంటున్నాడు. చిన్న పని చేసినా కమిషన్లు దండుకుంటున్నాడు. ముసునూరులో ఇసుక దోపిడీ అంతా ఇంతా కాదు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తా.
నాగార్జున సాగర్ ఎడమకాలువ నుండి నూజివీడుకు నీరు రావాలి. గతంలో.. ఈ ప్రాంతానికి నీరు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. చింతలపూడి పూర్తి చేసి నీరిస్తే నూజివీడు మామిడికి తిరుగులేదు. ఈ నియోజకవర్గానికి నీరిచ్చే బాధ్యత నాది. నూజివీడు ట్రాఫిక్ సమస్యకు ఏకైక పరిష్కారం ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం.
నూజివీడులో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తా. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలివ్వడమే లక్ష్యంగా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాను. కమిషన్ల కక్కుర్తితో వచ్చిన పరిశ్రమల్ని కూడా తరిమేశాడు. బడుగుబలహీన వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలిస్తా. టిడ్కో ఇళ్లు ఉచితంగా అందించి అండగా నిలుస్తాను.
మొదటి సంతకంతో మెగా డీఎస్సీ తీసుకొస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తా, అంత వరకు నెలకు రూ..3000 నిరుద్యోగ భృతి అందిస్తాను. నిరుద్యోగ యువత చైతన్య యాత్రలు చేస్తున్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నారు. ఏబీసీడీ వర్గీకరణ చేసి దళితులకు అండగా నిలుస్తా. ఇప్పటికే ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లోని ప్రతి హామీని అమలు చేసితీరుతాను.
నూజివీడును కృష్ణా జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వారి కల నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎమ్మెల్యేగా పార్ధసారధి, ఎంపీగా మహేశ్ యాదవ్‌ను గెలిపించుకోవాలి. నిన్నటి వరకు ఇంఛార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును రాజకీయంగా ఆదుకునే బాధ్యత నాది.
రాష్ట్రం బాగుపడాలంటే.. ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలి. ఉత్సాహం, అభిమానం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తుంటే కూటమి గెలుపు ఎలా ఉండబోతుందో కళ్లకు కనిపిస్తోంది.