ప్రజల ఐదేళ్ల కష్టాలకు నేటితో అడ్డుకట్ట

ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి

ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి

రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు

ఓటమిని జీర్ణించుకోలేని కౌంటింగ్‌లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది

కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు..నిబంధనలకు పట్టుబట్టండి

టెలీ కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచనలు

అమరావతి: ప్రజల ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతిఒక్కరి నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో సోమ వారం కూటమి కౌంటింగ్‌ ఏజెంట్లకు టెలీకాన్ఫరెన్స్‌లో సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంయమనం కోల్పోవద్దు

ఐదేళ్లు ఎంతో కష్టపడ్డారు..ఈ కష్టాన్ని, శ్రమను వచ్చే 24 గంటల పాటు కొనసా గించాలి. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్‌లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది. కూటమి కౌంటింగ్‌ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు.. నిబంధన లకు పట్టుబట్టాలి. కౌంటింగ్‌ ఏజెంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఏజెంట్లు నిర్ధేశిత సమయానికి కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు…తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

అనుమానం ఉంటే అభ్యంతరం తెలపండి

అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు. కంట్రోల్‌ యూనిట్‌ నెంబర్‌ ప్రకారం సీల్‌ను ప్రతి ఏజెంట్‌ సరిచూసుకోవాలి. ప్రతిఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను…కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరి చేసు కోవాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యాక పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్‌లు లెక్కిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌కు వెళ్లిన ఏజెంట్లకు ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు అభ్యంతరం తెలపవచ్చు. ఆర్వోలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎకనాలెడ్జ్‌మెంట్‌ తప్పకుండా తీసుకోవాలి. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. డిక్లరేషన్‌ ఫామ్‌ తప్పుకుండా తీసుకోవాలి. అనారోగ్య కారణాలతో ఏజెంట్‌ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉంది. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దు. ప్రతి ఓటూ కీలకమనేది గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.