ప్రమాణాల మెరుగుదల, టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టండి

– స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఫీడ్ బ్యాక్ కు ప్రత్యేక యాప్ అవసరం
– పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష

అమరావతి, మహానాడు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తిచేయాలని సూచించారు.

పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసి సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్కూళ్ల నిర్వహణపై ఫీడ్ బ్యాక్ కోసం రూపొందించిన యాప్ లలో ఎస్ఎంసి సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని అన్నారు. ఎస్ఎంసి సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతిస్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను వెంటనే సమకూర్చాలని మంత్రి ఆదేశించారు.

విద్యాకానుకకు సంబంధించి బాలురు, బాలికలకు ఒకేరకమైన ప్యాట్రన్ ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం వేలకోట్లు ఖర్చుచేస్తున్నా హాజరుశాతం కేవలం 70శాతం మాత్రమే ఉండటానికి గల కారణాలను అన్వేషించాలని, హాజరుశాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్యాగులు, షూస్, డిక్షనరీల నాణ్యతపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సమగ్రశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.