Mahanaadu-Logo-PNG-Large

100 రోజుల ప్రణాళికలో ఆంధ్రాకు పూర్వ వైభవం

– 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

విజయవాడ, మహానాడు: వంద రోజుల ప్రణాళికతో ఆంధ్రాకు పూర్వ వైభవం తీసుకొస్తామని, అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసి, మాట్లాడారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఆ సేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్న వేళ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త, మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య లాంటి మహనీయులను, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రాభివృద్ధి కోసం అధికారుల్లో, ప్రభుత్వ శాఖల్లో నూతనోత్తేజాన్ని తీసుకువచ్చి ఫలితాలు సాధించే దిశగా అడుగుల వేస్తున్నాం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో హంగు ఆర్భాటాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా పాలనను అందిస్తున్నాం.

పౌరుషాల పురిటి గడ్డ మన తెలుగు గడ్డ

1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం జరిగిందని చరిత్ర చెప్తోంది. అయితే అంతకంటే ముందే బ్రిటీష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946 లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాదు రాజధానిగా మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ను ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారీ కొత్త సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగింది.

రాజధాని లేని పరిస్థితుల నుంచి…

విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పనిచేయాలో కూడా తెలియని అనిశ్చితి పరిస్థితి నుంచి పాలన మొదలు పెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నాం. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5 శాతం వృద్ది రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. “ఈజ్ ఆఫ్ డూయింగ్” బిజినెస్‌లో ప్రథమంగా నిలిచాం. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాం. 2014 – 2019 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్ గా ఆవిష్కృతమైంది.

రాష్ట్రం నడిబొడ్డున సంపద సృష్టించే ‘ప్రజా రాజధాని’

రాజధాని లేని రాష్ట్రం అని నాడు బాధ పడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చ్యునిటీ (సంక్షోభాల నుంచి అవకాశాలు వెతుక్కోవడం) వెతుక్కున్నాం. ఆ క్రమంలోనే రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే స్థాయి రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో 34 వేల ఎకరాల భూసమీకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణం మొదలు పెట్టాం.

పోలవరం జీవనాడి

మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి నాడు అయిదేళ్ళ కాలంలో రూ. 68 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 72 శాతం పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తై ఆ ఫలాలను రాష్ట్ర ప్రజలు పొందేవాళ్లు.

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన:

120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటి మయం చేశాయి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు. వ్యవస్థలను చెరబట్టారు. బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకడలతో, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రజల, ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో పెను ఉత్పాతం సృష్టించారు.

ప్రజావేదిక కూల్చివేతతో మొదలు

ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనతో సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిటిలోనే చంపే ప్రయత్నం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో రూ. లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు, అసమర్థ, అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు. గత ప్రభుత్వ విధ్వంస, దోపిడీ విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. రాష్ట్ర విభజన కంటే కూడా 2019 – 24 మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది.

ఆదాయం తగ్గింది.. అప్పు పెరిగింది

గత ప్రభుత్వం అసమర్థ విధానాలతో రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుండి రూ.1,44,336కు పెరిగింది. తలసరి ఆదాయం 13.2 శాతం నుండి 9.5 శాతానికి తగ్గింది. అంటే గత ప్రభుత్వ తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. దీనిని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం అమలు చేయలేదని స్పష్టమవుతోంది. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు, కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మద్యం అమ్మకాలపై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.

కూటమి విజయం.. చారిత్రాత్మకం

అయిదేళ్ళ చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది. 2024 సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 93 శాతం స్ట్రయిక్ రేట్ తో, 57 శాతం ఓట్ షేర్ తో ‘టీడీపీ – జనసేన – బీజేపీ’ ప్రభుత్వం ఏర్పాటైంది. తద్వారా అహంకార, విధ్వంస, ప్రజా కంఠక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు. ప్రధాని మోదీ, నేను, మిత్రుడు పవన్ కల్యాణ్‌ ఇచ్చిన ‘‘ప్రజలు గెలవాలి – రాష్ట్రం నిలవాలి’’ అనే మా ఎన్నికల నినాదాన్ని అర్ధం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు.

మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతాం..

ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేం తెలియజేస్తున్నాం. గత అయిదేళ్ళు ప్రజలు ఏ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో.. ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ స్వాతంత్య్ర దిన వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ అయిదేళ్ళ తరువాత స్వాతంత్య్రం లభించింది. అందుకే ఎన్నికల తరువాత ప్రజల్లో అశాంతి తొలగిపోయి ప్రశాంతంగా ఉన్నారు.

సుపరిపాలనకు నాంది పలికిన కూటమి ప్రభుత్వం

ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలిరోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం.

బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 హామీలపై సంతకాలు

‘‘సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు..’’ అని నమ్మి ఆచరించిన నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో ప్రభుత్వం పయనిస్తోంది. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం. పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. గత 5 ఏళ్లలో ప్రజల కష్టాలు, ఆవేదన, వారి బాధలు చూసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం.

16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ..

‘‘నాడు – నేడు’’ అని మాయ మాటలు చెప్పిన గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర అగాథంలోకి నెట్టేసింది. రంగుల మోజుతో పాఠశాలలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం.. విద్యా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చింది. ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన రోజున 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి మా ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టాం.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు..

ప్రజలకు భూమితో ఉండే అనుంబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా. వారి బిడ్డల భవిష్యత్ కు ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. ఒక్క గజం అన్యాక్రాంతమైనా తట్టుకోలేరు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో జరిగిన భూకబ్జాలు, దోపిడీలు, రికార్డుల మార్పు, రీ సర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు తగలేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణం అయ్యారు. అందుకే ఆ సమస్యలను పరిష్కరించేందుకు రెండో సంతకంతో ‘‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్’’ను రద్దు చేశాం. మొదటి క్యాబినెట్ లో ఆమోదించి, మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన “మదనపల్లి ఫైల్స్” ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆక్రందనలు చూసిన తరువాతనే రాష్ట్ర స్థాయిలో కూడా భూ బాధితుల కోసం “మీ భూమి – మీ హక్కు” పేరుతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశ్యం.

సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు – సంక్షేమ పండుగ

మాది పేదల ప్రభుత్వం. పేదలకు సేవ చేయడంలో ఎన్నడూ ముందుండే మనసున్న ప్రభుత్వం. అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం. ‘‘పేదల సేవలో’’ అనే కార్యక్రమం ద్వారా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం.

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..

ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెడితే అంతకంటే తృప్తి మరేముంటుంది? అందుకే నాడు “అన్న క్యాంటీన్” లు ప్రారంభించాం. కేవలం రూ.5 లకే కడుపునిండా భోజనం పెట్టాలన్న ఆలోచన నుంచి పుట్టిందే “అన్న క్యాంటీన్”. తిరుమలలో నాడు అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన ఉచిత భోజన పథకం, డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొంది “అన్న క్యాంటీన్” పథకం తీసుకువచ్చాం.

రోజుకు సగటున 1.41 లక్షల మంది రూ.5 కే తృప్తిగా భోజనం చేసేవారు. అలాంటి అన్న క్యాంటీన్లపై కక్ష సాధించి, నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం. అయితే మళ్లీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచే 100 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో పునరుద్ధరిస్తున్నాం. మొత్తం 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నాను.

ప్రజలూ భాగస్వాములు కావాలి

ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలు ఇచ్చి ఆ మంచిలో మీరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తున్నాను. మీ పుట్టిన రోజు, మీ పెళ్లి రోజు, మీ ఇంట్లో శుభకార్యం రోజున మీరు విరాళం ఇస్తే, మీ పేరును అక్కడ ప్రదర్శించి మీపేరుతో ఆ రోజు ఆ “అన్న క్యాంటీన్” ద్వారా పేదలకు భోజనం పెడతాం. ఎవరు ఎంత విరాళం ఇచ్చారు అనే దాని కంటే.. ప్రజల్లో ఒక స్ఫూర్తి తీసుకువచ్చేందుకు ఈ పిలుపునిస్తున్నాను. ప్రజల భాగస్వామ్యంతో ఎల్లకాలం కొనసాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం.

నైపుణ్య గణన..

యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అయితే యువత ఉన్నత విద్యను అభ్యసించినా.. దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని పొందితే మంచి జీతాలతో ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే దేశంలో తొలిసారిగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. ఐదో సంతకం దీనిపైనే పెట్టాం. రాష్ట్రంలో 3.54 కోట్ల మందికి నైపుణ్య గణన చేపట్టి వారిలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ అమలు చేస్తాం.

ఉచిత ఇసుక విధానం

కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కాక్షించే ప్రభుత్వం. అందుకే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. గత ప్రభుత్వం ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం ఇసుక దోపిడీపై సిఐడి విచారణ జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత ఇసుక విధానంపై నిర్ణయం తీసుకున్నాం. ఇసుక దోపిడీకి చెల్లు చీటీ పాడి…రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. నిర్మాణ రంగం బాగుంటే లక్షల కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకే ప్రభుత్వం ఆదాయాన్ని కూడా వదులుకుని ఉచిత ఇసుక విధానం మొదలు పెట్టాం. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్ చేసుకుని పొందే వెసులుబాటును కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత పకడ్భందీగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాం.

ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు

ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రజలకు మంచి చేసేది ఉద్యోగులు, అధికారులే. అలాంటి వారికి హక్కుగా రావాల్సిన జీతాలు కూడా గత ఐదేళ్లలో వారికి సమయానికి అందలేదు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లూ అందడంతో వారి లో ఆనందాన్ని చూస్తున్నాం.

సూపర్ సిక్స్ అమలు చేస్తాం

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు హామీలను తీసుకొచ్చాం. వీటిలో కొన్నింటికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. మిగిలినవాటిని త్వరలోనే అమలు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, పాలసీలు ఉంటాయని తెలియజేస్తున్నాం.

ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ‘‘శ్వేత పత్రాలు’’..

కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు వివరించేందుకు అధికారంలోకి రాగానే ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతి భద్రతలు, మద్యం, పర్యావరణం, ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై కూలంకషంగా చర్చించాం. రానున్న రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో వీటిపై చర్చిస్తాం. ఇసుక దోపిడీ ఎలా జరిగింది.. మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరించాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేశాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదు. అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తునకు ఆదేశించాం. అక్రమార్కులను శిక్షించి తీరుతాం.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఏడాదికి రాజధానికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో నోడ్‌లకు, హైదరాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీనిచ్చింది. ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పనిదినాలను 15 కోట్ల నుండి 21.5 కోట్లకు పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగనుంది. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లు కేటాయించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ రాష్ట్రంతో చర్చించి ముందుకు వెళతాం.

వికసిత్ ఆంధ్రప్రదేశ్.. విజన్ – 2047

ప్రపంచంలో భారత దేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ – 2047 విజన్ ను రూపకల్పన చేస్తోంది. ఈ వికసిత్ భారత్‌ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా సిద్ధంగా ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. విజన్- 2047 రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ – విజన్ 2047ను విడుదల చేయబోతున్నాం.

పాలసీలతో పెనుమార్పులు…సైబరాబాదే సాక్ష్యం

పబ్లిక్ పాలసీలను బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. ఒక పాలసీ ప్రజల జీవితాలను, రాష్ట్ర ప్రగతిని మార్చుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. దేశంలో వచ్చిన 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ గమనం మారిపోయింది. వాటిని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పాలసీలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. సైబరాబాద్ నిర్మాణంలో నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టించాం. నాడు హైదరాబాద్ లో ముందుచూపుతో మొదలు పెట్టిన ప్రాజెక్టులను తరువాత ప్రభుత్వాలు కొనసాగించాయి. దీంతో విజన్ 2020 అనేది ముందుగానే పూర్తిస్థాయి ఫలితాలను ఇచ్చింది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అధికంగా తలసరి ఆదాయం పొందుతుంది అంటే దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో మేం తెచ్చిన పాలసీలే అని సగర్వంగా చెబుతాను. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవ్వడం వెనుక ప్రధాన కారణం మనం అవలంభించిన ప్రభుత్వ విధానాలే.

తలసరి ఆదాయంలో ఇండియన్స్ టాప్:

భారతీయులు, తెలుగు ప్రజలు ఇప్పుడు గ్లోబల్ సిటిజన్స్ నుంచి గ్లోబల్ లీడర్స్ అవుతున్నారు. నాలెడ్జ్ ఎకానమీలో మన యువత దూసుకుపోతున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్స్ తలసరి ఆదాయం 1.19 లక్షల డాలర్లు కాగా, అమెరికాలో ఉండే వైట్ అమెరికన్స్ తలసరి ఆదాయం 65 వేల డాలర్లు మాత్రమే ఉంది. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్న ఇండియన్స్ లో అగ్రభాగం మన తెలుగు వాళ్లే అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్ధిష్టమైన విధానాలతో పాలన సాగించబోతున్నాం. సమర్థవంతమైన నిర్ణయాలతో, నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాం.

జలవనరులు … నదుల అనుసంధానం

దేవుని దయవల్ల ఈ సారి సాగునీటి ప్రాజెక్టులకు జూలై నెలలోనే జలకళ వచ్చింది. ఇది రాష్ట్రానికి, రైతాంగానికి శుభసూచకం. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తిగా నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నీటి విలువ తెలిసిన మా ప్రభుత్వం ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకుని పొలాలకు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది.

స్వర్ణ చతుర్భుజి రహదారుల కార్యక్రమంతో దేశంలో ప్రధాన రహదారులను ఎలా అనుసంధానం చేశామో…అదే స్ఫూర్తితో దేశంలో నదుల అనుసంధానం కూడా జరగాలన్నది మా ఆకాంక్ష. రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ స్థాయిలో దీన్ని ఒక విధానంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వంశధార-నాగావళి- గోదావరి – కృష్ణా -పెన్నా నదుల అనుసంధానం అనేది మా ప్రభుత్వ విధానం. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన మొత్తంలో నీరు సమృద్ధిగా అందిస్తాం.

పోలవరం సవాళ్లను అధిగమిస్తాం

గత ప్రభుత్వ అసమర్థతకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును కూడా మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలతో రూ. 436 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్తది నిర్మించడానికి రూ. 990 కోట్లు అవసరం అవుతుంది. ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పనులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అమెరికా, కెనడా వంటి దేశాల నుంచి నిపుణులను పిలిపించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాం.

విద్యుత్ రంగం

దేశంలోనే తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఉమ్మడి రాష్ట్రంలో నాడు నాంది పలికాం. ఎవరూ సాహసించని సమయంలో ధృడమైన నిర్ణయాలతో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. దేశానికే మనం ఆదర్శంగా నిలిచాం. ఇంధన రంగం బలోపేతమైతే రాష్ట్రాభివృద్దికి అది ఇంధనం అవుతుంది. అందుకే మా ప్రభుత్వంలో ఎప్పుడూ విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఎవ్వరూ ఆలోచించని కాలంలో ఎంతో ముందు చూపుతో సోలార్ విద్యుత్ గురించి ఆలోచనలు చేసి ఆచరణలోకి తెచ్చాం. సోలార్, విండ్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని సాంప్రదాయేతర ఇంధన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాం.

సౌర విద్యుత్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం 2027 నాటికి దాదాపు 34 శాతం పెరుగుతుందని ఒక అంచనా. మారుతున్న ప్రజల అవసరాలు, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా నూతన ఎనర్జీ పాలసీని రూపొందించుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్ కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. గృహాలు, వాణిజ్య స్థలాలు, కార్యాలయాల్లో సౌరవిద్యుత్ ను ప్రోత్సహిస్తాం. రైతులు, ఇతర రంగాల ప్రజలు, సోలార్ విద్యుత్ ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు…మిగులు విద్యుత్ ను సంస్థలకు విక్రయించి ఆదాయం పొందే మార్గాన్ని కల్పిస్తాం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తాం. సోలార్- విండ్- పంప్డ్- బ్యాటరీ- బయో ఎనర్జీలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ కు నాంది పలుకుతాం.

వ్యవసాయ రంగం

రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతన్నను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి అవసరమైన చేయూతను అందిస్తాం. గత ప్రభుత్వం బాకాయిలు పెట్టిన రూ. 1674 కోట్ల ధాన్యం సొమ్మును రైతులకు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రూ. 2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నాం. త్వరలో రైతు సబ్సిడీలు మళ్లీ పునరుద్దరిస్తాం. రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందిస్తాం. యాంత్రీకరణ, సాగులో డ్రోన్ల వినియోగం తదితర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను రైతులకు చేరువ చేస్తాం. ఆక్వా, హర్టికల్చర్ కు సబ్సిడీలు ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెచ్చి.. అన్నదాతకు ఊతమిస్తాం. ఎన్‌డీఏ ప్రభుత్వ హామీ ప్రకారం అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తాం.

పారిశ్రామిక రంగం

2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. అయితే గత ప్రభుత్వ టెర్రరిజంతో కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. అలాంటి పారిశ్రామికవేత్తలను, కంపెనీలను మళ్లీ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు.. వారికి నమ్మకం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగానే నూతన పాలసీలకు శ్రీకారం చుడుతున్నాం.

రానున్న వంద రోజుల్లో కొత్త పాలసీలు తీసుకొ స్తాం. నూతన ఇండస్ట్రియల్, ఎంఎస్‌ఎంఇ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్ టైల్, టూరిజం పాలసీలు తెస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రగామి చేస్తాం. మెడ్ టెక్ జోన్ సాధించిన విజయం స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాట్లు చేస్తాం.

అదే విధంగా కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆయా క్లస్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాం. నక్కపల్లి, కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తాం.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట

పెట్టుబడులకు ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలే కీలకం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుంది. ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించటానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రహదారులను అభివృద్ధి చేస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టికి మార్గం సృష్టిస్తాం. ఇన్ లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టు లను ముందుకు తీసుకువెళతాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. గ్రామాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ను సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను సాధిస్తాం.

ఎయిర్ పోర్టులు

2014 -19లో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేశాం. కర్నూలుకు ఎయిర్ పోర్ట్ కూడా తీసుకువచ్చాం. గత ప్రభుత్వం పక్కన పెట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు పనులను మళ్లీ వేగవంతం చేశాం. పారిశ్రామికాభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారనుంది. వీటితో పాటు కొత్తగా కుప్పం, దగదర్తి వంటి చోట్ల విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ లు సిద్ధం చేస్తున్నాం.

పోర్టుల అభివృద్ధి

రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం పోర్టుల నిర్మాణానికి ముందడుగు వేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలతో మళ్లీ వాటిని వెనక్కి పంపింది. పోర్టులు ఆర్థిక, ఉపాధి కేంద్రాలుగా మారుతాయి. అందుకే మళ్లీ కూటమి ప్రభుత్వం పోర్టుల సత్వర నిర్మాణంపై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత త్వరలో మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టులను పూర్తి చేస్తాం.

సేవలు-పర్యాటక రంగం

రాష్ట్రంలో కరోనా కంటే కూడా నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగింది. తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా… గత ప్రభుత్వం కేవలం రూ. 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమ విలాసాల కోసం రుషికొండ లో ప్యాలెస్ ను నిర్మించుకున్నారు తప్ప… పర్యాటక రంగంపై శ్రద్ధ చూపలేదు. రిషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా గత ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై పెట్టకపోవడం విచారకరం. టూరిజం అభివృద్ది అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనది. మళ్లీ పర్యాటక రంగానికి మన ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకువస్తుంది. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడిదారులను మళ్లీ వెనక్కి తీసుకువస్తాం. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేసి రాష్ట్రాన్ని ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాం.

విద్యారంగానికి పూర్వ వైభవం

గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించాం. ప్రధానంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం. బడి ఈడు పిల్లలు ఎవరూ విద్యకు దూరంగా ఉండకూడదు అనేది మా విధానం. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు విద్యార్థుల సిలబస్ లో మార్పులు చేస్తాం. భాష లేనిదే జాతి ఉనికి ఉండదు. ఇంగ్లీషు కు ప్రోత్సాహం ఇస్తూనే ప్రాథమిక స్థాయి నుంచి మాతృ భాష తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. తెలుగు భాష వెలగాలనేది మా సిద్ధాంతం.

విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అందులో భాగమే విద్యార్థులకు అందే పథకాలకు “తల్లికి వందనం”, “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర”, “డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం”, “మన బడి- మన భవిష్యత్తు”, “బాలికా రక్ష”, “అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం” అని పేర్లు పెట్టాం. 2014 -19 నాటి పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. దీంతో ప్రభుత్వమే నేరుగా కళాశాలల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ను జమ చేస్తుంది. దీంతో విద్యార్థులకు ఎటువంటి ఫీజుల సమస్యలు ఉండవు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టిపెట్టడం కోసం టీచర్లపై అనవసర యాప్ ల భారం తొలగించాం.

వైద్య, ఆరోగ్యం

వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాం. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలు దశలవారీగా చెల్లిస్తున్నాం. టెలీమెడిసిన్ ను విస్తృత పరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తాం. గిరిజన గర్భిణీ లను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం అందిస్తాం. తద్వారా మాతాశిశు సంరక్షణ చేపడతాం. “ఎన్టీఆర్ బేబీ కిట్స్” ను తిరిగి ప్రవేశ పెడతాం.

ప్రజలకు ధరల భారం తగ్గింపు

ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతికి కేంద్రంగా మార్చుకుంది. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారు. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తోంది. నిత్యావసరాల ధరలను నియంత్రిస్తాం.

డెమోగ్రఫిక్ మేనేజ్ మెంట్

ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టాం. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు రెండు దశాబ్దాల క్రితం చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు అమలు చేశాం. అయితే నేడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో వృద్దుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుంది. ఇది దేశ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్యత దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించాం. అందుకే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగించాం. సంతానోత్పత్తిలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంతో సహా దక్షిణాది రాష్ట్రాలు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. యువ భారత్ కోసం డెమోగ్రఫిక్ మేనేజ్ మెంట్ ఆవశ్యకతను గుర్తించి ముందుకు సాగుదాం.

ప్రజల జీవితాలు మార్చేందుకు టెక్నాలజీ

టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తే పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చు. పేదల బతుకుల్లో పెను మార్పులు తేవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చు. టెక్నాలజీకి ఉత్తమ ప్రభుత్వ పాలసీలు తోడైతే అనూహ్యమైన విజయాలు సాధించవచ్చు. భారతదేశంలో టెక్నాలజీ ఉపయోగం పెరగడం వల్ల పేదరికం తగ్గిందని ఇటీవలే ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర, పారదర్శక పాలన అందించవచ్చు. పాలనలో సాంకేతికతను విస్తృత పరిచి ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేస్తాం.

పీ4తో పేదరిక నిర్మూలన

జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం టీడీపీ విధానం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది … అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. గతంలో పీ3 విధానంతో సంపద సృష్టించాం. ఇప్పుడు పీ4 – పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంతో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ లొకాలిటీ మన లక్ష్యం కావాలి. పేదరికం లేని సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి.

శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం..

మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విషయంలో “zero tolerance” (జీరో టాలరెన్స్) అని స్పష్టం చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్ ను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదు. మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. కానీ తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా. అవినీతికి పాల్పడి, ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించమని ప్రజలకు తెలియజేస్తున్నా.

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం

ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నదే మా నినాదం, మా విధానం. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమ న్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించాం. ఈ క్రమంలో నేడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. నేడు సుప్రీం కోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఇచ్చిన పథకాలను పునరుద్ధరిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఆదరణ, ముందడుగు, చైతన్యం, రోష్నీ వంటి పథకాలను అమలు చేస్తాం. మహిళల భద్రత, ఆత్మ గౌరవానికి పెద్ద పీట వేస్తాం. అందరికీ న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేయాలి. ఇందుకు మనమందరం కంకణబద్ధులం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1 గా చేయాలనే నా సంకల్పానికి మీ సహకారం కోరుతున్నాను. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నా.

చివరిగా భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యలను ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం..

“రాజ్యాంగం ఎంత మంచిదయినా అది అమలు చేసేవాడు మంచి వాడు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడు అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది.”రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులూ మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరుశాతం మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ.. మరోసారి మీ అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్.