మహిళలకు త్వరలో ఉచిత బస్సు సౌకర్యం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌

అచ్చంపేట, మహానాడు: ఎన్డీయే సర్కారు మహిళలకు త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అన్నారు.

అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన పై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య సమస్యలు లేని పల్లెలుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

నాలుగో రోజు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మండలం వేల్పూరు, చింతపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జగన్ చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రంలోని అన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని విమర్శించారు.