– ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మంగళగిరి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీపై త్వరలోనే తీపి కబురు చెబుతామని ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని తప్పకుండా నెరవేర్చుతామని వివరించారు. ప్రస్తుతం ఈ పథకం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఆ రెండు రాష్ట్రాల్లో పథకం అమలు తీరును నిశితంగా పరిశీలించి, ఏపీలో విధివిధానాలు ప్రకటిస్తామని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని గత ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని, ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
జగన్ పాలనలో మంత్రులు గంగిరెద్దుల్లా తలలు ఊపడం తప్పించి ఏంచేయలేదని, కానీ కూటమి మంత్రులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు