విద్య‌తోనే స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం సాధ్య‌మ‌వుతుంది

జూప‌ల్లి కృష్ణ‌రావు

హైద‌రాబాద్, జూలై 13: విద్య‌తోనే స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం సాధ్య‌మ‌వుతుందని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర‌భార‌తీలో శ్రీ నార‌య‌ణ గురు ధ‌ర్మ ప్ర‌చారణ‌ స‌భ ఆద్వ‌ర్య‌లో నిర్వ‌హించిన సెంటిన‌రీ వేడుక‌లు – స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి ముఖ్యతిధిగా హాజ‌ర‌య్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త శ్రీ నారాయ‌ణ గురు విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. సమాజంలోని మూడ విశ్వాసలను, కుల తత్వాన్ని నిరసించి, కులం కారణంగా కొన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ , సామాజిక స్వాతంత్రం ఉండాలని భావించిన గొప్ప వ్యక్తి నారాయణ గురు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోద‌యం, సామాజిక మాన‌వ‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు ప్ర‌య‌త్నం చేశాడని, కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. నారాయ‌ణ గురు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

దశాబ్ధాలు, శతాబ్ధాలు గడిచినా సమాజంలో ఇంకా అంత‌రాలు తొల‌గిపోలేద‌ని.. దీనికి మ‌న‌షుల ఆలోచ‌న ధోర‌ణి, ప్ర‌భుత్వాలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని… వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తి చూపారు. మ‌నిషి త‌న‌ను తాను సంస్క‌రించుకుని స‌మాజాన్ని సంస్క‌రించ‌డ‌మే చ‌దువు యొక్క అర్థం.. ప‌ర‌మార్ధం అని, నేటి విద్య వ్య‌వ‌స్థ‌లో ఇది లోపించింద‌ని, చదవేస్తే ఉన్న మతి పోయినట్లు త‌యారైంద‌ని అన్నారు. నేటి స‌మాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయ‌ని, యువ‌త ఆలోచ‌న ధోర‌ణిలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వారిని స‌న్మార్గంలో న‌డ‌పాల్సిన‌ బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, డా.జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీ నార‌య‌ణ గురు ధ‌ర్మ ప్ర‌చారణ‌ స‌భ ప్రెసిడెంట్ సాయిబాబా గౌడ్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఉపేంద‌ర్, వైస్ ప్రెసిడెంట్లు ముర‌ళీ మ‌నోహ‌ర్, చెన్న‌య్య‌, కోశాధికారి జంగ‌య్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.