– కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి
– కాంగ్రెస్ సిపాయిగా కేసీఆర్ కోటను బద్దలు కొట్టిన లెజెండరీ లీడర్
– శ్రేణుల్లో సమరోత్సాహం నింపిన యువనేత
– సొంత ఇమేజ్‌తో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన పోరాట యోద్ధ
– పార్టీని గద్దెనెక్కించిన తొలి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రికార్డు
జూన్ 26, 2021 నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది జూలై 7న ఆయన గాంధీ భవన్ లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో ఉంది.
అధికారం సంగతి అటుంచి… పార్టీ మిగులుతుందా అన్న ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. ఒక వైపు అధికార బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కకావికలమైన పరిస్థితి. మరోవైపు ప్రత్యామ్నాయ స్థానం కోసం సవాలు విసురుతున్న బీజేపీ…ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
వాస్తవానికి సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ, 2014 వ్యూహాత్మక వైఫల్యాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. తిరిగి 2018 లో కూడా కేవలం 19 సీట్లకే పరిమితం అయ్యింది. కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలతో ఆ 19 కాస్తా కేవలం, ఆరు సీట్లకే పరిమితం అయిన పరిస్థితి కాంగ్రెస్ ది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవాలన్న పట్టుదలతో సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరిస్తూనే, తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడమే తన ఏకైక లక్ష్యం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రభుత్వ వేధింపులు, కేసులు, హౌజ్ అరెస్టులు, నిర్భంధాలు, ఫోన్ ట్యాంపిగులు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయిన ఏనాడు రేవంత్ రెడ్డి వెనుదిరిగి చూడలేదు. పార్టీలో ఉండే నాయకులెవరో, పోయే నాయకులెవరో తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కూడా, టీడీపీ మాదిరిగానే ఉంటుందని అందరూ అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ పూర్తిగా చతికిలపడిన పరిస్థితి. ఇటువంటి అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన మీద ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుండి లక్ష్య సాధన దిశగా సాగారు రేవంత్ రెడ్డి.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే హుజురాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి తొలి సవాల్ గా నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3,014 (1.5 శాతం) ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఇక కాంగ్రెస్ ఖతం అనుకున్నారు అంతా… అంతలోనే మునుగోడు ఉప ఎన్నిక. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది.
ఇటువంటి పరిస్థితుల్లో అటు మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్రను రెండింటిని సమన్వయం చేసుకోవడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. మరో వైపు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీ మాత్రమే ప్రత్మామ్నాయం అనే భావన ప్రజల్లో బలపడింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం, డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా సమస్యల పోరాటం చేసి వారికి దగ్గరికి కావాలనే ఉద్దేశంతో దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ గర్జన, రైతు సంఘర్షణ సభ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో 2023, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 20 వరకు 33 రోజులపాటు చేపట్టిన యాత్ర (పాదయాత్ర) కాంగ్రెస్ పార్టీకి గేమ్ ఛేంజర్ గా మారింది. ఉత్తర తెలంగాణలో జిల్లాలో బలమైన బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఎదగడంలో ఈ యాత్ర ఎంతో దోహదపడింది.
రైతులు, దళిత, గిరిజన, బీసీ, యువత, విద్యార్ధులు, మైనార్టీ ఇలా వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలను.. డిక్లరేషన్ ల రూపంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య సమక్షంలో విడుదల చేశారు. ఇవన్నీ ఆయావర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచాయి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాకుండా చూస్తామనే మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మోదీ హవాసాగుతున్న పరిస్థితుల్లో సైతం తెలంగాణలో బీజేపీని నిలువరించి.. 8 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా చూసి తన సామర్ధ్యం ఏమిటో నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి.
చేపట్టిన కార్యక్రమాలు
2021 జూలై 12, నిర్మల్: పెట్రోల్ ధరల పెంపుపై నిరసన
ఏడాదిలో 24 సార్లు పెట్రోల్ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి కార్యక్రమం ఇదే. ఈ సందర్భంగా చేపట్టిన ఎడ్ల బండ్ల ర్యాలీకి, నిర్మల్ చూట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
2021 జూలై 16, హైదరాబాద్ : ఛలో రాజ్ భవన్
పెరిగిన పెట్రోల ధరలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తలు తమ భూజాల మీద ఎక్కించుకొని మరీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల ను రేవంత్ రెడ్డి దాటేలా చేశారు.
2021, ఆగస్టు 9 ఇంద్రవెల్లి, ఆగస్టు 18 రావిర్యాల దళిత గిరిజన దండోరా
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దళితులకు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై, దళిత బంధు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు.. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 9న నిర్మల్ జిల్లా ఇంద్రవెల్లిలో, ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమాలను చేపట్టారు. ఫలితంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ మరింత పెరిగింది.
2021, ఆగస్టు 24, 25 మూడు చింతలపల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష
దళిత గిరిజన దండోరా ద్వారా పార్టీకి లభించిన ఆదరణను మరింత ఎత్తుకు తీసుకు వెళ్లేందుకు రాష్ట్రంలోని దళితులు, గిరిజనులందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో ఆగస్టు 24, 25 తేదీల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 48గంటల పాట దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దళితునికి ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో రేవంత్ రెడి రాత్రి బస చేశారు.
2021, సెప్టెంబర్ 17 గజ్వేల్ దళిత గిరిజన దండోరా
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దళితులకు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై, దళిత బంధు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించారు. పోలీసులు ఆంక్షలు విధించిన దాదాపు లక్ష మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్న ఈ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై చార్జిషీటును విడుదల చేశారు.
2021, సెప్టెంబర్ 20 గన్ పార్క్, హైదరాబాద్ వైట్ చాలెంజ్
డ్రగ్స్ మహమ్మారి నుంచి తెలంగాణ యువతకు కాపాడి వారికి ఆదర్శంగా నిలిచేందు క్రమంలో మంత్రి కేటీఆర్ కు వైట్ చాలెంజ్ విసిరేందుకు హైదరాబాద్ గన్ పార్క వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరు జాతీయ స్థాయిలో చర్చనీయ అంశమైంది.
2021 సెప్టెబంర్ 22, హైదరాబాద్ ఇందిరా పార్క్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ రేవంత్ చేసిన ప్రసంగం అక్కడ సీతారాం ఏచూరీ వంటి జాతీయ స్థాయి నాయకులను ఆకట్టుకుంది.
2021 సెప్టెంబర్ 27 భారత్ బంద్, ఉప్పల్ డిపో ముందు నిరసన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులు చట్టాలు, లేబర్ కోడుకు వ్యతిరేకంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో చేట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉప్పల్ డిపో ముందు అఖిల పక్షం నేతలతో కలిసి నిరసన తెలిపారు.
2021 అక్టోబర్ 2 నిరుద్యోగ జంగ్ సైరన్, ఎల్ బీనగర్, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను గోస పెడుతున్న ప్రభుత్వంపై పోరుకు నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించారు. దీనికి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. హైదరాబాద్ లోని దిలుసుఖ్ నగర్ నుంచి ఎల్బీనగర్లోని తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహం వరకు తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. కానీ చాలా నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో నిరుద్యోగ విషయంలో పోరాడే పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు వచ్చింది.
2021 అక్టోబర్ 5 కాండిల్ ర్యాలీ నెక్లెస్ రోడ్, హైదరాబాద్
రైతు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనాలను నడిపి వారి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను భర్తరఫ్ చేయాలని కోరుతూ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ పీవీ నరసింహారావు మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కాండిల్ ర్యాలీ నిర్వహించారు.
2021 అక్టోబర్ 11, ఇందిరా పార్క్ మౌన దీక్ష
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఘటనకు నిరసనగా టీపీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన మౌన దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
2021 అక్టోబర్ 12 నిరుద్యోగ జంగ్ సైరన్, మహబూబ్ నగర్
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను గోస పెడుతున్న ప్రభుత్వంపై పోరుకు నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహబూబ్ నగర్లో నిర్వహించిన తొలి సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.
2021 నవంబర్ 18, హైదరాబాద్ ధర్నా
ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ‘కర్షకుడా కదలిరా.. ధాన్యం కొనేవరకూ ఉద్యమిద్దాం’ నినాదంతో హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలు, నగరం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
2021 నవంబర్ 19, కల్లాల్లోకి కాంగ్రెస్
రైతులు ధాన్యం అమ్ముకోవడం ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం పెడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కల్లాల్లోకి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు, కామారెడ్డి, మాచారెడ్డి, తాడ్వాయి మండలాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వడ్ల కుప్ప మీదే మరణించి రైతు బీరయ్య కుటుంబానికి రేవంత్ రెడ్డి లక్ష రూపాయాల సాయం చేశారు.
2021 నవంబర్ 20 కాండిల్ ర్యాలీ నెక్లెస్ రోడ్, హైదరాబాద్
రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించి 700 మంది రైతులకు నివాళిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ పీవీ నరసింహ రావు మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కాండిల్ ర్యాలీ నిర్వహించారు.
2021, నవంబర్ 27, 28 వరి దీక్ష
రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు వరి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి 48 గంటలపాటు దీక్ష చేసి దీక్ష శిబిరంలోనే బస చేశారు. సీనియర్ నేత జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి రేవంత్ దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా హాజరయ్యారు.
2021, డిసెంబర్ 11 తెలంగాణ అమరుల స్తూపం నిర్మాణ జాప్యంపై నిరసన
తెలంగాణ అమరుల స్తూపం నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టారు. తెలంగాణ అమరుల స్తూపం నిర్మాణాన్ని జాప్యం చేస్తూ మొండి గోడలతో నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని వెలివేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2021, డిసెంబర్ 18, నిత్యావసర ధరల పెరుగదలపై ఆందోళన
నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ముడిమ్యాల నుంచి చేవేళ్ల వరకు 10 కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఇందులో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
2021 డిసెంబర్ 27, రైతులతో రచ్చబండ
రైతుల వరి వేస్తే ఉరే అంటూ హెచ్చరిస్తూ మరోవైపు కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి వేసిన వైనాన్ని ప్రజల ముందు ఉంచేందుకు రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వరి వేసిన చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఈ కార్యక్రమం జరగకుండా రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల్లో కేసీఆర్ పట్ల ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ కలగడానికి ఈ కార్యక్రమం తోడ్పడింది.
2022, ఫిబ్రవరి 17
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను గోస పెడుతూ వారిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని మూడు రోజులపాటు నిర్వహించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
2022, ఫిబ్రవరి 26, మన ఊరు-మన పోరు పరిగి
స్థానిక సమస్యలపై టీపీసీసీ ఆధ్వర్యంలో మన ఊరు-మన పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో మొదటి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ చేసిన లాభం, టీఆర్ఎస్ మోసాన్ని వివరిస్తూ రేవంత్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాడానికి ఈ సభ ఎంతో ఉపకరించింది.
2022, మార్చి 13, మన ఊరు-మన పోరు కొల్లాపూర్
స్థానిక సమస్యలపై టీపీసీసీ ఆధ్వర్యంలో మన ఊరు-మన పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా రెండో సభను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కాంగ్రెస్ చేసిన లాభం, టీఆర్ఎస్ మోసాన్ని వివరిస్తూ రేవంత్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ప్రజలు తరలి వచ్చారు.
2022, మార్చి 20, మన ఊరు-మన పోరు ఎల్లారెడ్డి
స్థానిక సమస్యలపై టీపీసీసీ ఆధ్వర్యంలో మన ఊరు-మన పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా మూడో సభను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు టీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాన్ని రేవంత్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ప్రజలు తరలి వచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాడానికి ఈ సభ ఎంతో ఉపకరించింది.
ఏప్రిల్ 7, 2022 విద్యుత్‌సౌధ, సివిల్ సప్లయిస్ ఆఫీసు ముట్టడి
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ, విద్యుత్ చార్జీల పెంపును తగ్గించాలని డిమాండ్ చేస్తూ, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌధ, సివిల్ సప్లయిస్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యుత్‌సౌధకు వెళ్లేందుకు సిద్ధమైన వారిని ఖైరతాబాద్ ఫై ఓవర్ వద్ద పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. కార్యకర్తల భుజాలపై నుంచి నడుచుకుంటూ రేవంత్ రెడ్డి బారికేడ్లను దాటుకొనివచ్చారు.
మే 6, 2022 రైతు సంఘర్షణ సభ వరంగల్
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసగిస్తున్న తీరును వివరించడానికి టీపీసీసీ అధ్వర్యంలో వరంగల్లో రైతు సంఘర్షణ సభను నిర్వహించారు. ఈ సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి భరోసా కల్పించడానికి వరంగల్ డిక్లరేషన్ను విడుదల చేశారు. ఈ సభకు ఊహించని విధంగా ప్రజలు హాజరయ్యారు. సభతో వరంగల్ నగరం పూర్తిగా కాంగ్రెస్ మయమైంది. చాలా మంది సభ ప్రాగంణానికి చేరుకోలేకపోయారు. కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. ఆ స్థాయిలో సభ విజయవంతమైంది. తెలంగాణ రైతుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక నమ్మకం కలిగించడానికి ఈ సభ చాలా ఉపకరించింది.
మే 22, 2022 రైతులతో రచ్చబండ
వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వరంగల్ రైతు సంఘర్షణ సభతో ఏర్పడిన జోష్ ను మరింత పెంచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం హనుమకొండ జిల్లా అక్కంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ సారు ఊరుకు జరుగుతున్న అన్యాయాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షను ప్రపంచానికి తెలియజేశారు.
మే 23, 2022 రైతులతో రచ్చబండ
వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వరంగల్ రైతు సంఘర్షణ సభతో ఏర్పడిన జోష్ ను మరింత పెంచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుతో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫామ్ హౌస్ వేళ్లేందుకు రోడ్డు విస్తరించే క్రమంలో ఇల్లు ధ్వంసమైన ఎల్లవ్వకు రేవంత్ రెడ్డి సొంత నిధులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు.
జూన్ 13, 14, 2022 ఈడీ ఆఫీసు ముందు ధర్నా
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ పేరుతో రాహుల్ గాంధీని ఈడీ వేధించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు ఎదుట రెండు రోజులపాటు ధర్నా నిర్వహించారు.
జూన్ 15, 2022 హైదరాబాద్ బచావో
రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలు, మహిళలకు కరువైన రక్షణ, జూబ్లీహిల్స్ ఆత్యాచార ఘటనపై హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో టీపీసీసీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
జూన్ 16, 2022 ఛలో రాజ్ భవన్
అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ నిర్వహించిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాజ్‌భవన్ ముట్టడితో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించి వార్తల్లో నిలిచింది. సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడం, రాష్ట్ర రాజకీయాలు సైతం టీఆర్‌ఎస్- బీజేపీ మధ్యనే కేంద్రీకృతం అయినట్లు కనిపించడంతో ఇక కాంగ్రెస్ ఎక్కడ? అనే ప్రశ్న తలెత్తింది. అయితే, అలాంటి స్థితి నుంచి చలో రాజ్‌భవన్ ద్వారా టీపీసీసీ తనవైపు దృష్టిసారించేలా చేసింది.
2022 జూన్ 17, బాసర ట్రిపుల్ ఐటీ
బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసు పద్మవ్యూహాన్ని దాటి నాటకీయంగా బాసర చేరుకున్నారు. ఎన్‌ఎస్ యూఐ కార్యకర్తల సాయంతో ట్రాక్టర్, బైక్‌తో పాటు ముళ్లపొదల్లో ప్రయాణిం చి.. బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. ట్రిపుల్ ఐటీ చుట్టూ ఉన్న భారీ బందోబస్తు కళ్లుగప్పి యూనివర్సిటీలోకి ప్రవేశించారు. రేవంత్‌రెడ్డి ట్రిపుల్ ఐటీకి వస్తున్నట్టు ప్రకటించడంతో.. బాసరలో అడుగడుగునా పోలీసులను మోహరించారు. నిజామాబాద్ నుంచి బాసరకు ఆ ర్టీసీ బస్సులను సైతం నిలిపివేశారు. అంతలా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.
జూన్ 27, 2022 సత్యాగ్రహ దీక్ష
అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా మాల్కాజిగిరిలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
జూలై 6, 2022 ధరణి రచ్చబండ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రైతులకు ఎదురవుతున్న సమస్యలపై నిరసన తెలిపేందుకు హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ నిర్వహించారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభకు ధరణి బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
జూలై 21, 2022 ఈడీ ఆఫీసు ముందు ధర్నా
తెలంగాణ ఇచ్చి తల్లి సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు ముందు చేపట్టిన ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ధర్నాకు పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఆగస్టు 5, 2022 మునుగోడు సభ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరే నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు భారీ స్పందన లభించింది. అంచనాలకు మించి జనం, పార్టీ శ్రేణులు కదలివచ్చారు. వర్షాలు భారీగా పడుతుండడం, ప్రజలు పొలం పనుల్లో బిజీగా ఉండడంతో సభకు ఏ మేరకు వస్తారోనన్న సంశయం ఉన్నా.. సాయంత్రం 4 గంటలకే సభాస్థలి నిండిపోయింది. భారీ సంఖ్యలో హాజరైన జనం.. జోరుగా వర్షం కురుస్తున్నా కదలకుండా రేవంత్ ప్రసంగాన్ని వింటూ నిలబడిపోయారు.
సెప్టెంబర్ 3, 2022 మునుగోడు
మునుగోడు ఉప ఎన్నిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ఆధ్వర్యంలో చార్జిషీట్ వేశారు.
సెప్టెంబర్ 14, 2022 మరణించిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
మరణించిన 9 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులకు రాజీవ్‌గాంధీ ప్రమాద బీమా చెక్కులను రేవంత్‌రెడ్డి అందజేశారు.
2022, అక్టోబర్ 10-నవంబర్ 8 భారత్ జోడో యాత్ర-మునుగోడు ఉప ఎన్నిక
ఒక వైపు మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. ఈ రెండు అత్యంత కీలకమైన సందర్భాలు. టీపీసీసీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి. అయిన వెరవకుండా ఉదయం జోడో యాత్రలో పాల్గొంటూ, సాయంత్రం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడ పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.
నవంబర్ 21, 2022 సీఎస్ కు వినతి పత్రం
రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను పరిష్కరించడంతోపాటు ధరణి పోర్టల్ తో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
డిసెంబర్ 5, 2022 ధరణి ధర్నా వికారాబాద్
ధరణి, రైతు రుణ మాఫి, పోడు భూములు, రైతు బీమా వంటి సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. దీనికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
యాత్ర 2023, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 20 వరకు
కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ సంధించిన బ్రహ్మస్త్రం యాత్ర. 2023, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 20 వరకు 33 రోజులపాటు 30 నియోజకవర్గాల మీదుగా చేసిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నమ్మకంతోపాటు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో టీఆర్ఎస్ కు ఎదురులేదు, ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్న తరుణంలో.. రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ ఈమేజ్ ను మార్చేసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదగడానికి ఎంతో దోహదం చేసింది. పాదయాత్ర సాగిన 30 నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 18 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదం చేసింది.
టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీపై నిరసన దీక్ష
టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఉండగానే బయటికి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి ఏమాత్రం వెనుకాడుగు వేయలేదు. మార్చి 19న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ దీక్ష చేశారు. మార్చి 22న గవర్నర్ కు వినపతిపత్రం ఇచ్చారు.
ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ అండ్ కో చేస్తున్న మోసాలను మీడియా సాక్షిగా ఎండగట్టారు. దీనితో ప్రభుత్వం దొంగ కేసులు బనాయించి వేధించాలని చూసింది. అయిన రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రేవంత్ రెడ్డి చూపిన ఈ పోరాటపటిమ నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని మరింత పెంచింది.
యువ సంఘర్షణ సభ 2023, మే 8
తెలంగాణలో ఏర్పాటులో యువత, విద్యార్ధుల కీలక పాత్ర. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆయా వర్గాలను పట్టించుకోవడం మానేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురై పరిస్థితి దాపురించింది. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి.
ఈ నేపథ్యంలో యువత, విద్యార్ధులకు కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయింది. దీన్ని గమనించిన రేవంత్ రెడ్డి వారిలో విశ్వాసం నింపడంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో వివరించడానికి ప్రియాంక గాంధీ సమక్షంలో 2023, మే 8న యువ సంఘర్షణ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ విద్యార్ధి, యువతలో కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెంచడానికి దోహదం చేసింది.
2023, జూలై 2 ఖమ్మంలో రాహుల్ సభ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగా పార్టీని వీడిన నాయకులతోపాటు ప్రజల్లో మంచి పేరున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ముగింపుతోపాటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పార్టీలో చేరుతున్న సందర్భంగా 2023, జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో నిర్వహించిన జనగర్జన సభ విజయవంతమైంది. 2023 ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో 4 మినహా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఈ సభ దోహదం చేసింది.
2023, ఆగస్టు 27 తుక్కుగూడలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కీలకం. ఇందుకోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో 2023, ఆగస్టు 27న ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం పోయిన దళిత, గిరిజన సోదరులకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ ఒక ఆశాదీపంగా కనిపించింది. అందుకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
2023, సెప్టెంబర్ 16,17 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు
తెలంగాణలో పార్టీ అధికారంలో లేకున్నా 2023, సెప్టెంబర్ 16,17 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. కేవలం రేవంత్ రెడ్డి సామర్ధ్యం మీద నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి టానిక్ లా పని చేసింది. అసెంబ్లీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనే ఉత్సాహాన్నిచ్చింది.
2023, సెప్టెంబర్ 17 తుక్కుగూడలో విజయభేరి సభ
సెప్టెంబర్ 17న సోనియా గాంధీ సమక్షంలో నిర్వహించిన తుక్కుగూడ విజయభేరి సభ చరిత్రలో కనివినీ ఎరగని రీతిలో విజయవంతమైంది. ఇదే వేదిక నుంచి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తెలంగాణల కాంగ్రెస్ పార్టీ విజయానికి పునాది వేశాయి. సోనియా గాంధీ గారు మాట అంటే తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఆమె సమక్షంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించాలన్నా రేవంత్ రెడ్డి ప్రతిపాదన కాంగ్రెస్ పాలిట సంజీవనిగా పని చేసింది.
2023, నవంబర్ 9 కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్
జనాభాలో సగమైన బీసీల అభ్యున్నతి కోసం 2023, నవంబర్ 9న కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు బీఆర్ఎస్ వైపు ఉన్న బీసీలను కాంగ్రెస్ వైపు మళ్లించడం కోసం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం ఫలిచింది. బీసీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం పెరిగింది.
2023, నవంబర్ 9 మైనార్టీ డిక్లరేషన్
మైనార్టీ సోదరులకు అండగా నిలిచే ఉద్దేశంతో 2023, నవంబర్ 9న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. మైనార్టీలు తమ వైపే అని బీఆర్ఎస్, ఇంకో పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ గేమ్ ఛేంజర్ గా నిలిచింది.