జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి పూర్తి స‌హ‌కారం

* ఆర్ఆర్ఆర్ కు స‌హ‌క‌రించండి
* మ‌న్నెగూడ ర‌హ‌దారి
* ఎన్‌హెచ్ఏఐ అధికారులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి త‌మ పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ర‌హ‌దారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొల‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) ఉన్న‌తాధికారులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తో ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు.

స‌మావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్స్ మెంబర్ అనిల్ చౌదరి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన , సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసిం త‌దిత‌రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్ ఏఐ చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భూ సేక‌ర‌ణ‌తో పాటు తలెత్తున్న ప‌లు ఇబ్బందుల‌ను అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.

స్పందించిన ముఖ్యమంత్రి ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి బుధ‌వారం స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ర‌హ‌దారులు నిర్మాణం జ‌రిగే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు భేటీలో పాల్గొంటార‌ని, ఆయా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి అక్క‌డే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు.

ఆ ప‌నులు మొద‌లుపెట్టండి..
హైదరాబాద్, మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సూచించారు. కాంట్రాక్టు సంస్థ తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని వారికి సూచించారు. ఈ విష‌యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు.

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మ‌ధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేస్తున్న ప్రయత్నాలను ముఖ్య‌మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్ హెచ్ ఏఐ అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ మాల పథకంలో ఆర్ఆర్ఆర్ ను చేపట్టాలని ప్రధానమంత్రి మోదీకి ఇటీవల విజ్ఞప్తి చేసిన విషయాన్ని వారికి గుర్తు చేశారు.

ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయని సీఎం తెలిపారు. వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నామ‌ని, ఇందుకోసం బందర్ పోర్టును అనుసంధానించేలా హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. హైదరాబాద్ -కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలు పెట్టాలన్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రహదారితో తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని సీఎం వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక తో పాటు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పైన ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని సీఎంవో కార్యదర్శి షానవాజ్ ఖాసీం ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎన్‌హెచ్ఏఐ లేవ‌నెత్తిన అంశాలు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేవనెత్తిన అంశాలు..
1.మంచిర్యాల-వరంగల్‌-ఖ‌మ్మం-విజయవాడ (ఎన్ హెచ్ 163జీ) కారిడార్ నిర్మాణానికి భూముల అప్పగింత
2. ఆర్మూర్‌-జ‌గిత్యాల- మంచిర్యాల ( ఎన్ హెచ్ 63 ) భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేప‌ట్ట‌డం
3. వరంగల్- కరీంనగర్ (ఎన్ హెచ్ 563 ) రహదారి నిర్మాాణానికి చెరువు మట్టి ,ప్లై యాష్ సేకరణ
4. ఎన్‌హెచ్ 44తో కాళ్ల‌క‌ల్‌-గుండ్ల‌పోచంప‌ల్లి ర‌హ‌దారి ఆరు వ‌రుస‌ల విస్త‌ర‌ణ‌కు భూ సేక‌ర‌ణ‌
5.జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తున్న సమస్యల పరిష్కారం
6.ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం- కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత ఏర్పాటు