– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వని ప్రోత్సాహకం, ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. రెవెన్యూ కల్యాణ మండపంలో ఆదివారం ఆంధ్ర రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవి హాజరయ్యి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన సచివాలయ ఉద్యోగుల కోసం అనేక సదుపాయాలు కల్పించారని, సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్ళి వచ్చేందుకు వీలుగా వారానికి అయిదు రోజుల పని విధానాన్ని కల్పించారని గుర్తు చేశారు.
హెచ్‌ఆర్‌ఏను 16 శాతం నుంచి 24 శాతానికి పెంచారని, ఎన్నికల సమయంలో సీపీయస్ ను రద్దు చేస్తానని ప్రకటించి, రద్దు చేసి ఏపీ ఉద్యోగుల ఆత్మబంధువు గా చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు. ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలోనే ఎన్నికల్లో పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచిన మాధవిని ఆంధ్ర రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.