– పోలీసు అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
గుంటూరు, మహానాడు: గుంటూరులో ఎక్కడా గంజాయి అనే మాట వినపడకూడదు. గంజాయిపై ఉక్కుపాదం మోపండి అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాల్లో డాక్టర్ పెమ్మసాని ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలో సుద్దపల్లి డొంక ప్రియాంక గార్డెన్స్ ప్రాంతంలో మహిళలు పెమ్మసాని వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కవయ్యాయని, గంజాయి తాగుతూ, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తమపై దౌర్జన్యం చేస్తున్నారని వివరించారు. వెంటనే స్పందించిన పెమ్మసాని స్థానిక సీ.ఐ వీర సోమయ్యను పిలిచి మాట్లాడారు. తాను మళ్ళీ వస్తానని, గంజాయి మాట మళ్ళీ గుంటూరులో వినపడకూడదని ఆదేశించారు.