శరవేగంగా గేటు పునరుద్ధరణ పనులు

– మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం, మహానాడు: తుంగభద్ర డ్యాం గేటు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని బుధవారం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం19 గేటు కొట్టుకొనిపోయిన తర్వాత మంగళవారం నుండి పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఈ గేటు ప్రత్యామ్నాయ పనులలో భాగంగా చిన్న చిన్న గేట్లను తయారు చేస్తున్నారని, ఇందుకు మూడు గేట్లను తయారు చేసేందుకు మూడు కంపెనీలను కోరడమైనదని, పనులను శరవేగంగా మూడు కంపెనీలు పూర్తి చేశాయని తెలిపారు. ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయం కల్లా మొదటి గేటు డెలివరీ చేస్తారని, అయితే అంత లోపల చేయాల్సినటువంటి పనులన్నీ చేపడుతున్నారన్నారు. డ్యాం వద్ద దిగి పని చేసుకోవడానికి వీలుగా అక్కడ పారే నీటిలో కింద ఎటువంటి ఆధారం లేకుండా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందన్నారు.

ఈ పనులు చేయటానికి జిందాల్ కంపెనీ వారిని ఆశ్రయించగా, వారి వద్ద నుంచి రెండు క్రేన్లను పంపుటకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ క్రేన్ల ద్వారా కిందకు దిగి, వెల్డింగ్ పనులు పూర్తి చేసేవిధంగా చూస్తున్నామని, భారతదేశంలోని మన ఇంజనీర్లు సాసోపేతమైన చర్యని చేపడుతున్నారని, ఇది తుంగభద్ర బోర్డు, అధికారులు నిర్ణయమన్నారు. ఒకవైపు 30 వేల క్యూసెక్కుల నీరు పారుతున్న తరుణంలో ఎటువంటి ఆధారం లేకుండా నీటిపై పనులు పూర్తి చేస్తారన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీతో పంచుకోనున్నట్టు తెలిపారు.