Mahanaadu-Logo-PNG-Large

సర్దార్ గా ఖ్యాతి గడించిన గొప్ప నేత గౌతు లచ్చన్న

– టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విజయవాడ, మహానాడు: స్వాతంత్య్రం రాకముందు.. వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి లచ్చన్న చిత్ర పటానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితభావంతో ఎన్నో ఉద్యమాలు నడిపిన మహోన్నత నేత సర్దార్ గౌతు లచ్చన్న అని, గౌతు లచ్చన్న కార్యదక్షత, ఉక్కు సంకల్పం వల్లే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎగసిపడ్డ రాజకీయ కెరటమని, తాను నమ్మిన సిద్దాంతం కోసం పదవులను సైతం త్యాగం చేశారని పేర్కొన్నారు. తన రాజకీయ గురువు ఎన్‌జి రంగా కోసం ఎంపీ పదవిని సైతం త్యాగం చేశారని దేవినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు.