-గతంలో ఒక పేదవాడి కుటుంబ ఖర్చు పదివేలు
-జగన్ జమానాలో అది ఇరవైవేలు దాటింది
-జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై భగ్గుమంటున్న జనం
-సంక్షేమం కాదు బాబోయ్ సంక్షోభం అంటున్న ప్రజలు
-ఇచ్చేది బెత్తెడు…తీసుకునేది బారెడు అంటూ గగ్గోలు
-మారిన పరిస్థితి పై ముఖ్యమంత్రికి నివేదిక
-జగన్ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్న విశ్లేషకులు
(సువర్ణరాజు)
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయింది…మరి కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో వైసిపి పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంక్షేమ పథకాలు గురించి ఏమంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి రాజకీయ నేతలకే కాదు. అందరికీ ఉంటుంది.
మరి ఈ ప్రశ్నలను పార్టీలకు అతీతంగా ఉండే నిఖార్సైన కామన్ మ్యాన్ ని అడిగితే ఏమని సమాధానం చెబుతాడు? అలాగే ఏ ఎన్నికల్లోనైనా పార్టీ గెలుపోటముల్లో కీలకపాత్ర పోషించే మహిళా ఓటర్లును అడిగితే వాళ్లేం జవాబిస్తారు? ఎందుకంటే ఈ రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానాల మీదే ..రాబోయే ఎన్నికల్లో వైసిపి భవితవ్యం ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలుపుబాట పట్టించేది సంక్షేమ పధకాలేనని, సిఎం జగన్ తో సహా వైసిపి అభిమానులంతా ఇప్పటివరకూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మరి జగన్ అంతగా నమ్ముకున్న ఈ సంక్షేమ పధకాల గురించి అసలు జనం ఏమనుకుంటున్నారు? నిజంగానే ఆయన ఆశపడుతున్నట్లు ఈ సంక్షేమ పధకాలే జగన్ ని మళ్లీ గెలుపు బాట పట్టిస్తాయా? మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయా? పరిస్థితి అంత సానుకూలం గా ఉందా? అంటే సహజంగా సమాధానం అవునని రావాలి. కానీ ప్రస్తుతం ఎక్కువమంది నుంచి అందుకు విరుద్దమైన జవాబు వస్తుండటమే, సిఎం జగన్ ని కలవర పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల కాలంలో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
మొన్నటిదాకా వై నాట్ 175 అంటూ ఊదరగొట్టిన జగన్…ఆ తరువాత ఆ నినాదాన్ని పక్కనపెట్టేశారు. ఆ తరువాత అంతిమ గెలుపు మాత్రం మాదేననే ధీమా మాత్రం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే అలాంటి జగన్ ఉన్నట్టుండి.. తిరుపతిలో జరిగిన ఓ ‘ఎడ్యుకేషన్ సమ్మిట్’లో మాట్లాడిన మాటలు ఆ పార్టీ శ్రేణుల్నే నివ్వెరపరిచాయి. జగన్ ఈ వ్యాఖ్యలతో ఇప్పటివరకూ ఊహలపల్లకీలో ఊరేగుతున్న వైసిపి క్యాడర్, ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళంలోకి పడ్డట్లయింది. కారణం.. తమ అధినేత జగన్ నోటి నుంచి అలాంటి మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడూ వస్తాయని వారు ఊహించకపోవడమే! ఇంతకీ ఈ చర్చా వేదికలో సిఎం జగన్ ఏమన్నారంటే…”56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా”అని వ్యాఖ్యానించారు.తమ ప్రియతమ నేత, తమ పార్టీ అధినేత ఒక్కసారిగా అలా అంత బేలగా మాట్లాడటం చూసి ఖంగుతినడం వైసిపి అభిమానుల వంతయింది.
మరి ఉన్నట్టుండి సిఎం జగన్ ఎందుకు అలా మాట్లాడారు?…సహజంగా లోకల్ ఫీడ్ బ్యాక్ ని, జగన్ ఎప్పుడూ పట్టించుకోనరనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఏ సోర్స్ ద్వారా ఏ విషయాలు తెలిస్తే జగన్ అలా మాట్లాడారు? అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల మనోభావాలు ఎలాఉన్నాయనేది , ఖచ్చితంగా ఏదైనా గట్టి సోర్స్ ద్వారానే ఆయనకి తెలిసి ఉండాలి! అందుకే ఆయన అలా మాట్లాడి ఉండాలని మెడ మీద తల ఉన్న ఎవరైనా ఊహించవచ్చు. మరి తాను ఇంతగా కష్టపడి ఇస్తున్న సంక్షేమ పధకాల ఫలాలు ఏమయ్యాయి? ఎంతో సానుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు ఇంత ప్రతికూలంగా మారాయి? అంటే ఈ ప్రశ్నలకు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఒకటే. అదేమిటంటే జగన్ పాలన ఒక చేత్తో ఇచ్చి…మరో చేత్తో గిచ్చినట్లు ఉందని!
అదెలాగంటే… జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పే నవరత్నా లు ఉండే ప్రధాన సంక్షేమ పథకాలు… వైఎస్సార్ రైతు భరోసా- వైఎస్సార్ ఆరోగ్యశ్రీ- అమ్మఒడి- పింఛన్ల పెంపు- పేదలందరికీ ఇళ్ళు– ఫీజు రీయింబర్స్ మెంట్- వైఎస్సార్ జలయజ్ఞం- మద్యపాన నిషేధం అని తెలిసిందే. అయితే మొదట్లో ఈ పథకాల పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న సానుకూలత, క్రమంగా ఆవిరవుతూ వస్తున్న పరిస్థితి. జగన్ సర్కారు సగర్వంగా చెప్పుకొంటున్న సంక్షేమ పధకాలపై, ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మహిళలు పెదవి విరుస్తున్నారు. కారణం.. జగన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త పన్నులను విధిస్తుండం. రెండు.. ఆ పథకాల అమలులో ఉన్న లోపాలు, ఈ పరిస్థితికి దారితీసినట్లుగా కనిపిస్తోంది. సరే పథకాల అమలులో లొసుగుల విషయం పక్కనబెట్టినా.. పన్నులు,ధరల విషయంలో జగన్ బాదుడు మామూలుగా లేదని వారు వాపోతున్నారు. అసలు ఈ బాదుడు భరించేకంటే.. ఆ సంక్షేమ పథకాలు తీసేసినా పర్లేదనే వరకు, వారి ఆవేదన చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చెత్త పన్ను తో పాటు.. పెరిగిన ఇంటి పన్నులు,కరెంటు చార్జీలు,బస్ చార్జీలు వైసిపి మద్దతుదారుల్లోనూ అసంతృప్తి సెగలు రేపుతున్నాయి. సిమెంట్, ఇసుక, ఇనుము ధరలు భారీగా పెరిగిపోవడం పై అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. జగన్ సర్కార్ అధిక ధరలతో అందచేస్తున్న చిత్రవిచిత్రమైన బ్రాండ్ల మద్యంతో, అటు ఇల్లూ ఒళ్లూ రెండూ గుల్లయిపోతున్నాయి. సంక్షేమ పథకాలంటూ జగన్ ఒక చేత్తో ఇచ్చినట్లే ఇస్తూ , మరో చేత్తో ఇలా అంతకు పదింతలు తమనుంచి లాక్కుంటూ బతుకులు భారం చేసేశారని మహిళలు మండిపడుతున్నారు.
సంక్షేమ పధకాలంటూ జగన్ బటన్ నొక్కుడేమో గాని.. రాష్ట్రంలో నిరుపేదలు, కార్మికులు,చిరుద్యోగులు,మధ్య తరగతి ప్రజలు ఇలా అన్ని వర్గాల వారికి , బతుకు భారంగా మారిందని వాపోతున్నారు.పెరిగిన ధరలు,పెంచిన పన్నులతో నలుగురు సభ్యులుండే చిన్న కుటుంబానికి .. వైసిపి రాక ముందు నెలకు సుమారు 10 వేలు ఖర్చయితే.. ఇప్పుడు 20 వేలు దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేసినా ఇంటి ఖర్చు తగ్గించుకోవటానికి వీలు లేకుండా పోయిందని, ఇందుకు జగన్ వైఖరే కారణమంటూ మండిపడుతున్నారు.
ఒకవైపు ప్రతినెలా ఉద్యోగుల జీతాల విడుదల ఒక ప్రహసనంగా మారిపోవడం, మరోవైపు అనేక పథకాలకు బకాయిలు పెండింగ్ లో ఉండటం, సిఎం జగన్ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఆసరా పథకాన్నే తీసుకుంటే.. కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనేది ఇప్పుడు సోదిలోనే లేకుండా పోయింది. సంక్షేమ పథకాల లెక్కల ప్రకారం.. ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉండగా.. ఫిబ్రవరి మధ్యకు వచ్చినా వాటి ఊసేలేదు. అలాగే జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల కూడా, వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో పేరుతెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలు కూడా, జగన్ హయాంలో నామమాత్రంగా మారిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో, అవి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్ప, ఉచిత వైద్యం చేసేది లేదని హఠం వేశాయి. ఫలితంగా వైఎస్ ఎంతో గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ.. సొంత కొడుకు జమానాలో ఆనారోగ్యశ్రీగా మారటం, కచ్చితంగా వైఎస్‌కు అప్రతిష్ఠనే నన్నది మనం మనుషులం అన్నంత నిజం!
జగన్ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న సంక్షేమ పథకాలు ఏదోరకంగా అమలవుతున్నా.. ఈ స్థాయిలో మహిళల్లో అసంతృప్తి సెగలు రేగుతుండటం వైసిపి మద్దతుదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఎన్నికలు సమీపిస్తున ఈ తరుణంలో సానుకూలత అంతా ఆవిరై, ఆగ్రహావేశలు రగులుతుండటంపై ఏం చెయ్యాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ సవాళ్లు- ప్రతిసవాళ్లతో ధీమా కనబర్చిన జగన్, తన ఇటీవలి ఓటమి వ్యాఖ్యలతో అదంతా మేకపోతుగాంభీర్యమేనని తేల్చేసినట్లయింది.
మరి ఈ పరిస్థితిని జగన్ ఎలా అధిగమిస్తారు ? దీనికి అతని దగ్గర మంత్రదండం లాంటి వ్యూహం ఏమైనా ఉందా? లేక ఎంతోమంది కాకలు తీరిన రాజకీయ యోధులు సైతం కాల ప్రవాహంలో కనుమరుగైనట్లు… తాను కూడా ఒన్ టైమ్ వండరర్ గానే మిగిలిపోతారా?…లేక తానే చెప్పుకొంటున్నట్లు అర్జునుడి లాగా విజయ శంఖారావం పూరిస్తా రా ?…ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మరికొద్ది నెలల్లోనే లభించనున్నాయి.