– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: వినుకొండపై కొలువైన రామలింగేశ్వర స్వామి గుడికి ఏడాదిలోపు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. అందుకు కావాల్సిన నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు, దాతలు సహకరిస్తే ఆ ఆలయాన్ని మరిన్ని సౌకర్యాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్ లోని శ్రీ సమర్ధ సద్గురు షిర్డీ సాయిబాబా 64వ ఆరాధన మహోత్సవాల్లో ఆదివారం ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సీతారాముల కల్యాణం కన్నులవిందుగా నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
గత ప్రభుత్వంలో రూపాయి ఇవ్వలేదని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్ర బాబును అడగగానే గుడి కోసం రూ. 2 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి కోసం నిధులు అడగ్గానే 9, 10 ఎన్ని కోట్లయినా ఇవ్వమని అధికారులను ఆదేశించారని సంతోషం వ్యక్తం చేశారు. వినుకొండలో టీటీడీ కల్యాణ మండపానికి అడగ్గానే సీఎం రూ. 3 కోట్లు ఇచ్చారన్నారు. త్వరలోనే తితిదే నుంచి పెద్ద కల్యాణ మండపం పూర్తి చేసుకుంటామన్నారు. కొండమీదకు మెట్లదారికి తనవంతు ఆర్థిక సాయం చేస్తానని, పెద్దలు ముందుకు వచ్చి తలా నాలుగు మెట్లు కట్టిస్తే భక్తులంతా మెట్ల పూజలు చేసుకుంటారన్నారు.