-వ్యవసాయానికి ఊతమివ్వండి
-సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి
-100 శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలి. నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి పోతుంది.
-5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో సబ్ కమిటీ
-స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు
-సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ ఎస్ఎల్ బీసీ సమావేశం
-2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల.
-రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక
అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలి అన్నారు. దీని కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సిఎం స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో అన్నారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. 227వ SLBC సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళికను విడుదల చేశారు. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతం కంటే 14 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3,23,000 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా…ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,75,000 కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.2,08,136 కోట్ల రుణాలు మంజూరు జరిగిందని సమావేశంలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే MSME రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు రుణాలు, సాంప్రదాయేతర ఇంధన సెక్టార్ కు రూ. 8,000 కోట్లు రుణాలు ఇవ్వనున్నారు.
5 ప్రధాన అంశాలపై ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని…మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని..వాటిని నెరవేర్చేందుకు తీసుకుంటున్న చర్యలకు బ్యాంకులు చేయూతనివ్వాలని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో సాగు ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని…దీనిపై ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పని చేయాలని సీఎం అన్నారు.
ముఖ్యంగా కౌలు రైతులకు రుణాల విషయంలో ఉన్న ఆంక్షలను తొలగించి వారు సులభంగా రుణాలు పొందే పరిస్థితి కల్పించాలని చంద్రబాబు అన్నారు. పలు కీలక అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పని చేయాలన్నారు. దీని కోసం మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 5 అంశాలపై ప్రణాళికలు సిద్దం చేసి, అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని సీఎం పేర్కొన్నారు.
సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇచ్చే అంశంపై బ్యాంకులు ఫోకస్ పెట్టాలని అన్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఏపి ప్రభుత్వం మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని….రానున్న రోజుల్లో నెంబర్ 1గా నిలిచే ప్రణాళికలు అమలు చేయాలని సిఎం అన్నారు. డిజిటల్ చెల్లింపులను బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని చెప్పారు. దీని వల్ల అవినీతి తగ్గుతుందని… ప్రొడక్టవిటీ పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
పేదరికం నిర్మూలన విషయంలో ప్రభుత్వం కొత్తగా పి 4 విధానం తీసుకువస్తుందని సిఎం అన్నారు. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంపైన సబ్ కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. యువత స్కిల్ పెంచడంపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని…స్కిల్ డెవలప్ మెంట్ కు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ స్టడీ చేయాలని సిఎం సూచించారు.
ఇకపోతే సంపద సృష్టించే, జిఎస్ డిపి పెంచే రంగాలకు బ్యాంకుల ప్రోత్సాహం అవసరమన్న దానిపైనా ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో సబ్ సమిటీ చర్చిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాల్లో సత్వర నిర్ణయాలు, మెరుగైన ఫలితాలు సాధించే విధంగా మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… హార్టికల్చర్, ఆక్వా కల్చర్ కు బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో హార్టికల్చర్ పూర్తిగా నాశనం అయ్యిందని, తిరిగి నిలబెడితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమ వృద్ది చెందేలా ఆవులు, గేదెలు కొనుగోలుకు బ్యాంకులు ఆంక్షలు లేకుండా రుణాలు ఇవ్వాలని సూచించారు. కౌలు రైతులకు రుణం అందడం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ….93 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని, కొత్త ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అనేక ఆశలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అయితే వీటికి బ్యాంకు సహకారం అవసరమన్నారు. బ్యాంకులు రాష్ట్ర అభివృద్ది ప్రయాణంలో ట్రస్టెడ్ పార్ట్ నర్స్ కావాలన్నదే చంద్రబాబు గారి అభిప్రాయమని తెలిపారు.
డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కరువు ప్రాంతంలో సిరులు పండించిన చంద్రబాబు ఆలోచనలకు బ్యాంకులు బాసటగా నిలవాలని సూచించారు. అంతా డబుల్ డిజిట్ గ్రోత్ గురించి మాట్లాడుతుంటే… సీఎం చంద్రబాబు ఎకానమీని డబుల్ చేయాలనే ఆలోచనలతో పని చేస్తున్నారని అన్నారు.
సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీ.వి.ఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.