జిల్లాలో రైల్వేల అభివృద్ధికి పెద్దపీట వేయండి

– విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో జిల్లా సమస్యలను వివరించిన ఎంపీ
– జిల్లాలో రైల్వేల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలే ధ్యేయంగా మీటింగ్‌లో ప్రస్తావించిన ఎంపీ వేమిరెడ్డి
– మౌలిక సదుపాయాల కల్పనతో ప్రయాణికులకు మేలు జరుగుతుంది
– బిట్రగుంటలో ఉన్న రైల్వే భూములను సద్వినియోగం చేసుకోవాలి
– నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ పనులను వేగవంతం చేయాలి
– జీఎం ముందుకు ఆర్‌యూబీ ఏర్పాటు, పడుగుపాడు సహా పలు అంశాలు

నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వేల అభివృద్ధికి కృషి చేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌, ఇతర ముఖ్య అధికారులను కోరారు. శుక్రవారం విజయవాడ సత్యనారాయణపురంలోని ఈటీటీ సెంటర్‌లో రాష్ట్రంలోని ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే బోర్డు నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రైల్వే పరంగా ఉన్న వివిధ సమస్యలను మీటింగ్ లో ప్రస్తావించారు. బిట్రగుంటలో ఉన్న రైల్వే భూములను సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో రైల్వేలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. బిట్రగుంట రైల్వేస్టేషన్‌ పరిధిలో దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైల్వే సెంటర్‌కు సంబంధించి ప్రస్తుతం 400 ఎకరాల భూమి అభివృద్ధి కోసం ఖాళీగా ఉందన్నారు. అదేవిధంగా జాతీయ రహదారి-16కి ఆనుకుని ఉన్న బిట్రగుంటలో అభివృద్ధికి చాలా అవకాశం ఉందన్నారు. ఇక్కడ రైల్వే ప్రాజెక్టులు తీసుకువస్తే ఎంతో మేలని చెప్పారు. కృష్ణపట్నం ఓడరేవు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరియు రామాయపట్నం ఓడరేవులు బిట్రగుంట నుంచి కేవలం 20- 45 కి.మీ.ల దూరంలో ఉన్నాయని జీఎంకి వివరించారు. ఇక్కడ కార్యాలయ భవనాలు, రైల్వే క్వార్టర్స్, మెయింటెనెన్స్ డిపో, తగినంత నీటి సరఫరా, మెడికల్ రిలీఫ్ వ్యాన్, ఆఫీసర్స్ రెస్ట్ హౌస్‌లు, డ్రైవర్లు మరియు గార్డుల కోసం రన్నింగ్ రూమ్‌లు, రైల్వే హెల్త్ యూనిట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

అలాగే నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపీ వేమిరెడ్డి గారు.. జీఎంకు వివరించారు. 2022లో మంజూరైన పనులు ఆలా ఆలస్యంగా జరుగుతున్నాయని, పనులు త్వరగా పూర్తి చేసేలా సదరు కాంట్రాక్టర్‌ కు తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పనులు పూర్తయితే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. దాంతోపాటు నెల్లూరు పరిధిలో రైల్వే హాస్పిటల్‌ ఏర్పాటుపై పరిశీలించాలని సూచించారు.

నెల్లూరు పశ్చిమ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ స్థితిగతులపై ప్రస్తావించారు. భూసేకరణ ఆలస్యంగా జరుగుతోందని, దాన్ని వేగవంతం చేసి త్వరితగతిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే విజయవాడ- గూడూరు మధ్య ఏర్పాటు చేస్తున్న మూడో లైన్‌ పనుల్లో వేగం పెంచాల్సిన అవసరాన్ని వివరించారు.

అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్న పడుగుపాడు రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి గత 8 నెలలుగా మూసివేయబడిందని, దాంతో ప్రయాణికులు ఫ్లాట్‌ఫాంలు మారేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే దాన్ని బాగు చేసి తిరిగి ప్రారంభించాల్సి ఉందన్నారు. రైల్వేస్టేషన్‌ లో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య వేధిస్తోందని, వీటిని వెంటనే పరిష్కరించి ప్రయాణికుల అవస్థలు తొలగించాలని కోరారు. దాంతోపాటు అల్లూరు రోడ్డు, పడుగుపాడు, వెంకటేశ్వరపాలెం, తెట్టు-ఉలవపాడు, కొండాయపాలెం, వేదాయపాలెం వంటి రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీ, ఆర్‌ యూ బీ లను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

జిల్లా పరిధిలో పలు ముఖ్య స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌కు సంబంధించి సమస్యలను ఎంపీ.. జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఉలవపాడులో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, బిట్రగుంటలో విక్రమసింహపురి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, గూడూరులో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని కోరారు. వీటన్నింటిపై సానుకూలంగా స్పందించిన జీఎం… జిల్లాలో రైల్వే సమస్యల పరిష్కారానికి తప్పకుండా పనిచేస్తామని అన్నారు. ప్రతి రైల్వే క్రాసింగ్‌ వద్ద తప్పకుండా ఆర్‌వోబీ లేదా ఆర్‌యూబీ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.